ఎట్టకేలకు.. సబిత, ధర్మాన రాజీనామా ఆమోదం

విస్తరణపై ఊహాగానాలు
హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) :
ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం ఆమోదించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ఆ మంత్రులిద్దరూ అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాన్‌పిక్‌ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా అంశానికి సంబంధించి సబితా ఇంద్రారెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో అభియోగాలు నమోదు కావడంతో వారిద్దరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణలకు సూచించింది. ఈ వ్యవహారంపై అనేక తర్జన భర్జనల తర్వాత సీఎం రాజీనామా చేయాలని మంత్రులను కోరారు. ముఖ్యమంత్రితో సుదీర్ఘ చర్చలనంతరం వారు రాజీనామా చేయగా ఇంతవరకూ అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆదివారం ఉదయం మంత్రుల రాజీనామాల లేఖలను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజ్‌భవన్‌కు పంపారు. వీటిని ఆయన ఆమోదించినట్లు తెలిసింది. గత వారం అధిష్టానం ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగన్‌ అక్రమాస్తుల కేసు ఛార్జీషీట్‌లో ధర్మాన, సబితలను నిందితులుగా సీబీఐ పేర్కొంది. దాల్మియా ఛార్జీషీట్‌లో సబిత, వాన్‌పిక్‌ ఛార్జీషీట్‌లో ధర్మాన ప్రసాదరావు నిందితులు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్లు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది. సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల రాజీనామాలు ఆమోదించడంతో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు ¬ంశాఖపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరి శాఖలను సీఎం తనవద్దే ఉంచుకున్నారు. తదుపరి కేటాయింపుల వరకు ఆయన పర్యవేక్షించే అవకాశం ఉంది. ¬ం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానా రెడ్డి తదితరులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా దామోదర ¬ం కోసం పట్టుబడుతుండగా.. కిరణ్‌ మాత్రం ఆయనకు కట్టబెట్టేందుకు ఇష్ట పడటం లేదు. తనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న వారిని సాధ్యమైనంతగా దూరం పెట్టి తనకు అనుకూలంగా ఉండే వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కిరణ్‌ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. సబిత, ధర్మానలు రాజీనామా చేయడంతో పునర్వ్యవస్థీకరణ తప్పకుండా ఉంటందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేపటి నుంచి రోజుల రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత 29న ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 30వ తేదిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఇతర కాంగ్రెసు పెద్దలతో, 31న అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటారు. దాదాపు పునర్వ్యవస్థీకరణకే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కిరణ్‌ వద్దే ¬ం, రహదారులు సబిత, ధర్మానలు రాజీనామాలు చేయడంతో వారు నిర్వర్తించిన ¬ం, రహదారుల శాఖను ఎవరికిస్తారోననే చర్చ కాంగ్రెసు వర్గాల్లో సాగింది. అయితే ప్రస్తుతానికి ఆ శాఖలను కిరణ్‌ తన వద్దే అట్టి పెట్టుకున్నారు. జూన్‌ 10 నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ లోగా ఎవరికైనా అప్పగించాల్సి ఉంటుంది! పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతానికి కిరణ్‌ వాటిని తన వద్ద అట్టిపెట్టుకున్నారని అంటున్నారు. శాసనసభ సమావేశాలకు ముందే పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఒకే అంటే వెంటనే విస్తరణ చేపడతారు. ఇన్నాళ్లు ¬ంను సబితా ఇంద్రా రెడ్డి నిర్వహించిన అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని సమాచారం.  మెదక్‌ జిల్లాకు చెందిన సునితా లక్ష్మా రెడ్డి, గీతా రెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన డికె అరుణలు తెలంగాణ ప్రాంతం నుండి మహిళలుగా ఉన్నారు. ఇందులో సునిత పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన దామోదర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో సునితా లేదా గీతా రెడ్డికి ఇచ్చే అవకాశాలపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.  డికె అరుణకు ఇచ్చే విషయమై కూడా చర్చ సాగుతోందని సమాచారం. . అలాకాకుండా తనకే ఇవ్వాలని దామోదర పట్టుబట్టి లాబియింగ్‌ చేసిన పక్షంలో సీనియర్‌ నేత అయిన జానా రెడ్డిని కిరణ్‌ తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శ్రీధర్‌ బాబు, డి.శ్రీనివాస్‌ కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది.  కాగా, సబితా ఇంద్రా రెడ్డి వచ్చే నెల 7న కోర్టు మెట్లు ఎక్కనున్నారు.