ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు

సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): మణుగూరులో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఓ.సిలో వరద నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే భారీ వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఇల్లందు నియోజక వర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు ఏరియా సింగరేణి జేకే 5 ఓసిలో ఓబీ పనులకు, కోయగూడెం ఓసిలో సుమారు 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఇకపోతూ పెద్దపల్లి జిల్లాలో గత మూడు రోజులుగా ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గ ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. గనుల పని స్థలాలలో వరద నీరు చేరుతోంది. దీంతో రామగుండం రీజియన్‌ పరిధిలోని 1, 2, 3, 5 ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో
బొగ్గు ఉత్పత్తి నిలిపేయాల్సి వచ్చింది. రోజుకు సుమారు 40 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని.. వర్షాల కారణంగా ఈ మేరకు బొగ్గ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని సమాచారం