ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం

ద్రవ్యోల్బణంపై ప్రధాని ఆందోళన
సంకీర్ణం నడపడం కత్తిమీదసామే
మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఎపిఇఎంఎస్‌):ప్రస్తుతం ఉన్న 5శాతం వృద్ధిరేటు కలవరపెడుతోంది.. అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ 8శాతం వృద్ది రేటు లక్ష్యాన్ని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. చైనా 7.5శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించిందన్నారు. బుధవారంనాడు సిఐఐ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఎగుమతుల తగ్గుదల.. కరెంటు ఖాతా లోటు వల్ల ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయన్నారు. 2008 ఆర్థిక మందగమనం ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితుల వల్ల మన దేశం తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ద్రవ్యలోటును అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అవినీతి జాఢ్యం పట్టి పీడిస్తోందన్నారు. అధికారుల్లో అవినీతి, అలసత్వం ప్రతిబంధకాలుగా మారాయన్నారు. సమగ్ర భూ సేకరణ బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఆర్థిక రంగంలో మరికొంత కాలం వరకు మందగమనం తప్పబోదన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదని ఆయన అన్నారు.