ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు – ఎస్‌ఈసీ
హైదరాబాద్,నవంబరు 29(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్లపాటు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పార్థసారథి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఎస్‌ఈసీ విూడియాతో మాట్లాడారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జీహెచ్‌ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాకుండా డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 74,67,256 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 38,89,637 పురుషులు, మహిళలు 35,76,941 మంది, 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 22,272 కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందురోజు శానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. కరోనా పాటిజివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లు, వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ వివరించారు.”జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెరాస నుంచి 150 మంది, భాజపా 149, కాంగ్రెస్ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం నుంచి 12 మందితోపాటు 415 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం డివిజన్లలో మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు ఉండగా.. రామచంద్రాపురంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్నారు. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎన్నికల నియమావళి అమలుకు 19 మంది ప్రత్యేక బృందాలను సిద్ధం చేశాం. ప్రజలు, పార్టీ నేతలు ఎలాంటి ఫిర్యాదునైనా నోడల్ అధికారులకు చేయొచ్చు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం నంబర్ 040-29555500ను సంప్రదించాలి” అని ఎస్‌ఈసీ వివరించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం: సీపీ మహేశ్ భగవత్
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 వార్డులకు పోలింగ్ జరగనుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భద్రత దృష్ట్యా 8 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధులపై సిబ్బందికి ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు. అన్ని పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు.