ఇయాల్టి నుంచి హెల్మెట్ మస్ట్

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ పైనా నజర్‌

నేటి నుంచి సిటీలో స్పెషల్‌ డ్రైవ్స్‌

ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడి

రాజధానిలో గడిచిన మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ సోమవారం పేర్కొన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నుంచి నగర వ్యాప్తంగా హెల్మెట్‌, రాంగ్‌ సైడ్‌/రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 215 మంది అశువులుబాశారన్న ఆయన…వీరిలో 100 మంది ద్విచక్ర వాహన చోదకులే అని పేర్కొన్నారు. వీరిలో 46 మంది హెల్మెట్‌ ధరించని కారణంగానే చనిపోయారని, హెల్మెట్‌ ధరిస్తే క్షతగాత్రులుగా మారే ప్రమాదం 70 శాతం, మృత్యువాతపడే ముప్పు 40 శాతం తగ్గుతుందని విశ్వప్రసాద్‌ వివరించారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపే చోదకులకు రిస్క్‌ మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే నగరంలోని ద్విచక్ర వాహనచోదకులు 100 శాతం హెల్మెట్‌ ధరించేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్న ఆయన మంగళవారం నుంచి దీంతో పాటు రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ పైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. హెల్మెట్‌ ధరించని వారికి రూ.200, రాంగ్‌ సైడ్‌/రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌కి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపారు. నగరవాసులు సైతం తమ దృష్టికి వచ్చిన ఉల్లంఘనల్ని ట్రాఫిక్‌ పోలీసు అధికారిక ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాలతో పాటు హెల్ప్‌లైన్‌ నెం.9010203626 ద్వారా అధికారుల దృష్టికి తేవాలని కోరారు.