నేటి నుంచి టెట్ దరఖాస్తులు
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్ ప్రకటించారు. టెట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
పండిట్లకు ప్రత్యేక పేపర్ ఉండాలి
టెట్‌లో అనుసరిస్తున్న విధానంతో బీఈడీ భాషాశిక్షణను పూర్తిచేసిన వారికి అన్యాయం జరుగుతున్నది. ప్రత్యేకించి లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు టెట్‌లో ప్రత్యేక పేపర్ లేకపోవడంతో వీరు నష్టపోతున్నారు. బీఈడీ వారికి నిర్వహించే టెట్ పేపర్-2లో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ, రెండో విభాగంలో మొదటిభాష, మూడో విభాగంలో ఇంగ్లిష్ ప్రశ్నలిస్తారు. ఇవి అందరికి కామన్‌గా ఉంటాయి. కీలకమైన నాలుగో విభాగంలో గణితం సైన్స్‌కు కలిపి ఒక పేపర్, సోషల్ స్టడీస్‌కు ఒక పేపర్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంతో బీఎడ్‌ను తెలుగుతో పూర్తిచేసిన వారు గణితం, ఫిజికల్‌సైన్స్, సాంఘికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులను చదవాల్సి వస్తున్నది. భాషా పండిత అభ్యర్థులు ఈ సబ్జెక్టులకు చెందిన 60 ప్రశ్నలను చేధించేందుకు తిప్పలుపడుతున్నారు. ఈ విధానాన్ని తొలగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీ తరహాలో భాషల్లో ప్రత్యేకంగా ప్రశ్నలివ్వాలని కోరుతున్నారు.
సైన్స్ అభ్యర్థుల పాలిట శాపంగా పేపర్-2
టెట్ పేపర్-2 సైన్స్‌లో ఇస్తున్న గణితం ప్రశ్నలను తొలగించాలని అభ్యర్థులు డిమాం డ్ చేస్తున్నారు. బీఈడీలో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పద్ధతులు రెండు వేర్వేరుగా ఉంటున్నాయి. అదే టెట్‌కు వచ్చేసరికి సైన్స్ పేపర్‌లో గణితం నుంచి 30 ప్రశ్నలిస్తున్నారు. ఇది అటు జీవశాస్త్రం ఇటు భౌతికశాస్త్రం అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నది. దీంతో అనేక మంచి అభ్యర్థులు టెట్ క్వాలిఫై కావడంలేదు. సంబంధం లేని గణితం ప్రశ్నలను తొలగించాలని ఫిజికల్ సైన్స్‌తోపాటు, బయోసైన్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.