ఎన్నికల వేళ కొలువులిచ్చేద్దాం

60 వేల ఖాళీల భర్తీకి సర్కారు సన్నాహాలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : ఎన్నికల వేళ కొలువుల జాతరాకు సర్కారు సన్నాహాలు చేస్తుంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి దాన్ని అధిగమించేందుకు యత్నిస్తోంది. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో తాయిలాల ద్వారా విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాయిలాలు వెదజల్లి ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకొనేందుకు ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే వివిధపథకాలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యువతపైనా కన్నేశారు. భారీగా ఉద్యోగ నియామక ప్రకటనలు చేయడం ద్వారా నిరుద్యోగులను, యువతను తనవైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు. వివిధ శాఖల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగాల జాతరకు తెర లేపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. ఈ ఏడాదిలోపు ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరైన ఈ భేటీలో ఖాళీల భర్తీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో గుర్తించి, వాటి భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు తెలపాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. మొత్తం 60 వేల పోస్టుల ఖాళీల వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎస్‌కు అందించారు. వివిధ శాఖల్లో ఉపాధ్యాయుల పోస్టులు 22 వేలు, వైద్య, ఆరోగ్య శాఖలో 10 వేలు ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు వివరించారు. మొత్తం ఖాళీల వివరాలు సేకరించిన మిన్నీ మాథ్యూ వీటిని వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించనున్నారు. వారంలోగా ముఖ్యమంత్రి ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగాల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడనున్నప్పటికీ, ఎన్నికల దృష్ట్యా నియామకాల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున యువతను ఉపాధి, ఉద్యోగాలతో ఆకట్టుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకొని కొలువుల జాతరకు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌ ఖాళీల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఖాళీల వివరాలు అందగానే పాలనాపర అనుమతులు ఇవ్వడం, నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.