ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ

` పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గురువారం ఉదయం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కుల సర్వే జరిగిందని, బీసీల నోటి ముద్దను భాజపా లాగే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.