ఎపిలో శృతిమించిన పోలీస్‌ ఆగడాలు

బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా
పులివెందుల ఘటనతో సిఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి
ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌
పులివెందుల లాకప్‌డెత్‌పై మండిపడ్డ రామకృష్ణ
విజయవాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఏపీలో పోలీసులు శృతిమించుతున్నారని, విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి కొట్టి చంపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకపాలనకు సీఎం జగనే కారణమన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇంత దిగజారడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పులివెందులలో లాకప్‌ డెత్‌ జరగడం అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా జగన్‌ ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. పులివెందులలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, సీఎం జగన్‌కు సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. పులివెందుల లాకప్‌ డెత్‌పై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పూర్తిగా
విఫలమయ్యారన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రముఖుల ప్రమేయం ఉందని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.అమరావతి రైతులు న్యాయం స్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీగా వెళతామన్నారు. వారు శాంతియుతంగా చేస్తామంటే.. 3వేల మంది పోలీసులు, వంద చెక్‌ పోస్టులు పెట్టి రైతులను అణచివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ రాష్టాన్న్రి పూర్తిగా అప్పులమయం చేశారని రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో జగన్‌ సర్కార్‌ ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతోందా? అని ప్రశ్నించారు. జగన్‌ తీసుకువచ్చిన రుణ ధనం ఏమవుతోందని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పొరుగు రాష్టాల్రకు తరలిపోతున్నాయన్నారు. పాదయాత్ర సమయంలో జగన్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగులను నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు. అన్ని వర్గాలు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యంపై సీపీఐ పోరాటం చేస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలపై విశాఖలో రెండు రోజులపాటు వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఇకపోతే నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దాసోహం అయ్యిందని రామకృష్ణ విమర్శించారు.కేంద్రం రైతు అనుకూల చట్టాల పేరుతో మూడు నల్లచట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్‌ సంస్థలకు లబ్ది చేకూర్చిందని ఆరోపించారు. కార్మికుల 46 చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. కరోనా దుర్భర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారం మోపు తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అధానీ, అంబానీల అడుగులకు మడుగులొత్తుతోందని విమర్శించారు.