ఎమ్మెల్యేముత్తిరెడ్డిపై చర్య తీసుకోవాలి
మాజీమత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్
జనగామ,జూలై 29(జనంసాక్షి ): ప్రజలను ఓట్ల కోసం ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారనడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్మాఖ్యలే నిదర్శనమని పిసిసి మాజీచీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బహిరంగంగానే దళితబంధుపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ దీనిని ఒక ఎన్నికల పథకంగా వాడుకోవడం దారుణమన్నారు. దీనిపై ఇసి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ముత్తిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ సోయి ఉన్నోళ్లకే దళితబంధు ఇస్తామని, కేసీఆర్‌కు ఓట్లు వేస్తామన్న వారికే అవకాశం కల్పిస్తామని, ఇందులో దాపరికం ఏమాత్రం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొమురవెల్లి మండల
సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్థులకు దళితబంధు అందలేదని, అర్హులకు వర్తింపజేయాలని రాంసాగర్ సర్పంచ్ తాడూరు రవీందర్ ఎమ్మెల్యేను కోరగా దీనికి ముత్తిరెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ సోయి ఉన్నోళ్లు గ్రామంలో ఉంటే వాళ్ల పేర్లు పంపించాలన్నారు. గతంలో లేని విధంగా నీళ్లు, విద్యుత్తు ఇస్తున్నామని, ఆడ బిడ్డ పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సోయి ఉండి, సీఎం కేసీఆర్‌కు ఓట్లు వేస్తామన్నవారికి అవకాశం కల్పిస్తామని, ఇందులో దాపరికం ఏవిూ ఉండదని ఎమ్మెల్యే అనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామ సర్పంచ్‌ను సమావేశంలో… ’కేసీఆర్‌కు ఓట్లు వేస్తేనే దళిత బంధు నువ్వు నోరు మూసుకుని కుర్చో‘ అని అవమానించిన ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.