ఎమ్మెల్యే నరేందర్ పై ఆరోపణలు సరికాదు
విలేకరుల సమావేశంలో ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నప నేని నరేందర్ పై బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేసిన ఆరోపణలు సరికాదని ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూరి సంజయ్ బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం కరీమాబాదులోని ఆదర్శ ఫంక్షన్ హాల్ లో దసరా ఉత్సవ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంజయ్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే నరేందర్ పై ప్రదీప్ రావు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. గత 100 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను ఎంతో ఐకమత్యంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఇందులో ఎలాంటి భేదభిప్రాయాలు లేవని తెలిపారు. ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్ను నరేందర్ పై అవాస్తవమైన ఆరోపణలు చేసిన ప్రదీప్ రావు క్షమాపణ చెప్పాలని కోరారు. దసరా ఉత్సవాలు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్వయం ప్రతిపత్తి కలిగిన స్వేచ్ఛతో కూడిన ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైనా వారు రాజకీయంగా చూసుకోవాలి కానీ ఉత్సవాలతో ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీలో పదవులు సీనియారిటీతో వస్తాయని అన్నారు. ఈ సమావేశంలో ఉత్సవ కన్వీనర్ వడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఉత్సవ కమిటీ బాధ్యులు ఓగిలిశెట్టి అనిల్, గోనె రాంప్రసాద్, సుంకరి సంజీవ్, సందీప్, బొల్లం మధు, రాజు, రంజిత్, వాసు రవి, అశోక్ కాళీ చరణ్, మహేష్, అఖిల్, రాజు, శ్రీనివాస్, కృష్ణ, గోవర్ధన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.