ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ప్రకటనే లాంఛనం

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) ఃరాష్ట్రంలో ఈనెల 19వతేదీతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా లోని ఎమ్మెల్సీల ఎన్నికకార్యక్రమం చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పినా ఏకగ్రీవంగానే ముగియపోతోంది. నామినేషన్ల స్వీకరణకు సోమవారం సాయంత్రం మూడు గంటలవరకు చివరి సమయం కాగా కాంగ్రెస్‌నుంచి అయిదుగురు, టిడిపినుంచి ముగ్గురు, వైఎస్సార్‌సిపి నుంచి ఒకరు, టిఆర్‌ఎస్‌నుంచి ఒకరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం కల్లా అధికారికంగా ఎన్నికైనట్లు ప్రకటించను న్నారు. కాంగ్రెస్‌ నుంచు తిరుగనరి సంతోష్‌కుమార్‌ (కరీంనగర్‌), మహ్మద్‌ అలీ షబ్బీర్‌ (నిజామాబాద్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (ఖమ్మం), లక్ష్మిశివప్రసాద్‌, కోలగట్ల టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు( విజయనగరం), సలీం (హైదరాబాద్‌), శమంతకమణిలు, టిఆర్‌ఎస్‌నుంచి మహమూద్‌ అలీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ నుంచి ఆదిరెడ్డిలు మాత్రమే నామినేషన్‌ వేశారు. అయితే పదకొండో అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ వేయక పోవడంతో ఎన్నిక నూటికి నూరుపాళ్లు ఏకగ్రీవంగానే ముగిసింది. తమ సంఖ్యాబలం చూసుకుని మాత్రమే వివిద పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు వేయించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి మరో స్థానం పొందేందుకు అవకాశం ఉన్నప్పటికి, ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడం వల్లే వెనుకంజ వేసింది. ఆరో అభ్యర్థితో నామినేషన్‌ వేయిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ చిట్టచివరి నిమిషంలో ఆప్రతిపాదనను విరమించుకుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ పరువు పోవడమేకాక, రంగంలో ఉన్న అభ్యర్థుల జేబులు సైతం లక్షల్లో ఖాళీ అయ్యేవనేది వాస్తవం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకోసం సుమారు లక్షకుపైగా వెచ్చించిన సందర్బాలు కనిపించాయి. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ తన ఎక్కువ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టిఆర్‌ఎస్‌ను చీల్చాల్సి వచ్చింది. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. టిడిపిలో సైతం ప్రకంపనాలు సృష్టించాయి. అయితే ఈసారి అధికార కాంగ్రెస్‌ మరో అభ్యర్థిని నిలపెడితే ఓట్లు రాకపోగా పరువు పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించే కిమ్మనకుండా ఉండిపోయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పదకొండో అభ్యర్థిని రంగంలోకి దింపడం వల్ల అన్ని పార్టీలకు టెన్షన్‌ వాతావరణం కలిగే అవకాశం ఉండకనే ఉండేది. రాజకీయ చతురతను ప్రదర్శించడమేకాక, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు సైతం గురిచేయాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. ఈచర్య ఎటువైపు తిరుగుతుందో చెప్పడం కష్టం కనుక కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం సాహసం చేయకుండానే అయిదుగురితోనే సంతృప్తి చెందింది. ఎట్టకేలకు పదిమంది ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. తద్వారా రంగంలో ఉన్న అభ్యర్థులకు సైతం జేబులు ఖాళీకాకుండా మిగిలి పోయాయి.