మా విమానాశ్రయంపై మీ పెత్తనమేంది?
డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభ గరంగరం
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం.. రాష్ట్రాన్ని సంప్రదించలేదు : సీఎం కేసీఆర్
యథాతథ స్థితిని కొనసాగించాలని అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్, నవంబర్ 21 (జనంసాక్షి) : డొమెస్టిక్ టెర్మినల్‌కు నందమూరి తారకరామారావు పేరు పెట్టడంపై శుక్రవారం అసెంబ్లీలో దద్దరిల్లింది. మా విమానాశ్రయంపై మీ పెత్తనమేంది?.. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘాటుగా ప్రశ్నించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పేరు మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగిలించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని దేశీయ టెర్మినల్ పేరు మార్పును శాసనసభ ఖండించింది. రాష్టాన్న్రి కనీసం సంప్రదించకుండా పేరు మార్చడంపై విచారం వ్యక్తం చేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి ఇప్పుడున్న పేరునే కొనసాగించాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పేరు మార్చాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అలాగే, తెలంగాణకు చెందిన వారి పేర్లను పెట్టాలని సూచించింది. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకుంది. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని కోరుతూ సభలో ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని, యథావిధిగా పేరును కొనసాగించాలని సభలో తీర్మానం చేయాలని కోరుతూ స్పీకర్ పోడియంలోకి దూసుకెల్లింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటూ.. అన్ని పార్టీలతో చర్చించి సభలో తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. దీంతో సభాపతి మధుసూదనా చారి సభను వాయిదా వేసి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని టీడీపీ, బీజేపీ బహిష్కరించాయి. అఖిలపక్ష భేటీ ముగిసిన అనంతరం శాసనసభ తిరిగి సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న దేశీయ టెర్మినల్‌కు పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విఆచరం వ్యక్తం చేస్తోంది. డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతోంది. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండా పేరు మార్చడం సరికాదు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని సభ తీర్మానిస్తోంది’ అని సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీజేపీ మినహా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయి. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నేతల పేర్లను తమపై రుద్దడం సరికాదన్నారు. తెలంగాణలో పక్క రాష్ట్రం వాల్ల పేర్లు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రసత్‌ఉతం ఉన్న పేర్లనే తొలగించాలన్నది తెలంగాణ ప్రజల డిమాండ్ అని చెప్పారు. కమ్యూనిస్టులు కూడా ప్రజల సెంటిమెంట్‌ను, మానసిక వ్యవస్థను అర్థం చేసుకొని పోతున్న తరుణంలో.. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. దేశీయ టెర్మినల్‌కు పేరు మార్పుపై కనీసం రాష్టాన్న్రి సంప్రదించకపోవడంపై మండిపడ్డారు. ఒకవేళ కేంద్రం పేరు మార్చాలని భావించి ఉంటే.. తెలంగాణ వ్యక్తి పేరును పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని పేర్కొన్నారు. రాజీవ్ మాజీ ప్రధాని అని, దేశం కోసం సేవ చేస్తూ మరణించారని చెప్పారు.అంతగా పేరు పెట్టుకోవాలంటే ఆంధ్రాలో పెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి.. వాటికి పెట్టుకోవచ్చు కదా? హైదరాబాద్‌లోని విమానాశ్రయానికే ఎందుకు పేరు మార్చాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశ్యం మాకులేదని స్పష్టం చేశారు. ఒక్కదానికి కాదు… ఆంధ్రలో ఉన్న నాలుగు విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి.. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మాకు చరిత్ర లేదా? మా వాళ్ల పేర్లు పెట్టుకోవద్దా? ఇదేం పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పేర్లు మార్చాల్సి వస్తే తెలంగాణ వారి పేర్లు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. పేరు మార్పు విషయంలో కేంద్రం తెలంగాణను సంప్రదించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి.. ఆయనను విమర్శించడం లేదు.. ఆయన జీవితంపై చర్చ కాదు.. ఎన్టీఆర్ పేరు పెట్టడమే సమస్య అని తెలిపారు. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఇక్కడ చర్చ జరగడం లేదని, పక్క రాష్ట్రం వారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతోందన్నారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం విచారకరమని, పేరు మార్చాలన్న ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోలేదని పేర్కొన్నారు. పేరు మార్పు విషయంలో యథాతథ స్థితి కొనాసగించాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రతిపక్ష నేత జానారెడ్డి తెలిపారు. గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ పేరును కొనసాగించాలని కోరారు. రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలు విడిచారని గుర్తు చేసిన జానా.. పేరు మార్చడానికి ఏం అవసరమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య వ్యవస్థకే విరుద్ధమని విమర్శించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు.టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరే ఉండేదని చెప్పారు. రాజీవ్‌గాంధీ పేరు తొలగించి, ఎన్టీఆర్ పేరు పెట్టలేదని, అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉందని తెలిపారు. దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంటే.. వైఎస్ ప్రభుత్వం కావాలనే ఎన్టీఆర్ పేరును తొలగించిందని విమర్శించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల నేత అని, ఆయనకు ప్రాంతీయతత్వం ఆపాదించడం సరికాదన్నారు. మండల్ వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, 610 జీవో వంటి వాటిని ఆయనే తీసుకొచ్చారని గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉండేదని, వైఎస్ ప్రభుత్వం పేరు మార్చి తప్పు చేసిందని మండిపడ్డారు. బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు మార్చినప్పుడు రాజీవ్ పేరు పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి లాంటి వారెందరో ఎన్టీఆర్ వద్దే రాజకీయాలు నేర్చుకున్నారని, ఆయన అందరి నేత అని అన్నారు. ఎన్టీఆర్ పేరున ఆంద్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలకు పెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారు.. కొమరం భీం వంటి ప్రముఖుల పేర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి భావదారిద్యం ఉందని విమర్శించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని దేశీయ టెర్మినల్‌కు పీవీ నరసింహరావు, కొమరం భీం పేరు పెడితే బాగుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. పేరు మార్పు విషయంలో అవసరమైతే కేంద్రాన్ని సంప్రదిద్దామని తెలిపారు. తెలంగాణ బిడ్డల పేరునే విమానాశ్రయానికి పెట్టుకుందామన్నారు. ప్రజల ఆకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీపీఎం, వైఎస్సార్‌సీపీ, సీపీఐలు కూడా తీర్మానానికి మద్దతు తెలిపాయి. యథాతథ స్థితి కొనసాగించాలని, లేకపోతే కొమరం భీం ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని సూచించాయి. అనంతరం సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
ఇదీ తీర్మానం
”హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారణ వ్యక్తం చేస్తున్నది. పేరు మార్చాలని కేంద్రం ప్రభుత్వం ముందుకు ప్రతిపాదన వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకపోవడంపై సభ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పేరు మార్పు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని సభ తీర్మానిస్తోంది”