ఎయిర్‌ ఏసియా విమానం అదృశ్యం

1

కూలిపోయి ఉండొచ్చు

162 మంది ప్రయాణికులు

కొనసాగుతున్న గాలింపు చర్యలు

జకార్తా డిసెంబర్‌ 28(జనంసాక్షి)-

ఇండోనేషియా నుంచి సింగపూర్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఏషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. ఇండోనేషియా-సింగపూర్‌ క్యుజడ్‌ 8501 విమానానికి కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ఉండగా అందులో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 149మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్‌, బ్రిటన్‌, మలేషియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎయిర్‌ ఏషియా విమానం ఇండోనేషియాలోని సురబయ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. ఉదయం 8.30 గంటలకు విమానం సింగపూర్‌ రావాల్సి ఉండగా… 7.20గంటల సమయంలో ఎయిర్‌ కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఎయిర్‌ ఏషియా అధికారులు ప్రకటించారు. అదృశ్యమైన విమానం కోసం అధికారులు గాలింపు చేపట్టారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఎయిర్‌ ఏషియా ప్రకటించింది. అదృశ్యమైన ఎయిర్‌ ఏషియా ఏషియా విమానం కూలిపోయి ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసఫ్‌ ఖల్లా చెప్పారు. ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్‌ ఏషియా విమానం గాలింపు చర్యలకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో జుసఫ్‌ ఖల్లా మాట్లాడుతూ.. విమానం కూలిపోయి ఉండొచ్చని, కాలిమాంటన్‌- బెలిటుండ్‌ ఐలాండ్‌ మధ్య విమానం అదృశ్యమై ఉండొచ్చని తెలిపారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు అసాధారణమైన దారిలో(అన్‌యూజ్‌వల్‌ రూట్‌) ప్రయాణించడానికి పైలట్లు అనుమతి కోరారని వెల్లడించారు. అదృశ్యమైన విమానాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు

జరుగుతున్నాయని చెప్పారు. విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఈ రోజు సాయంత్రం ఆపివేశారు. సోమవారం ఉదయం నుంచి మళ్లీ మొదలుపెడతారు. ఇదిలావుండగా, భారత్‌కు వెళ్లే విమాన సర్వీసులు షెడ్యూల్‌ ప్రకారం వెళతాయని ఎయిర్‌ ఏషియా యాజమాన్యం పేర్కొంది. విమానం అదృశ్యమైన ఘటన, భారత్‌కు వెళ్లే విమాన సర్వీసులపై  ప్రభావం చూపబోదని చెప్పారు.