ఎర్రన్నాయుడికి కన్నీటి వీడ్కోలు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖులు సంతాపం
ఒక అధ్యయనం ముగిసింది.. నిమ్మాడ శోకసంద్రమైంది.. ఎక్కడ చూసినా మౌన వేదనే.. ఎవరిని కదిపినా కన్నీటి రోదనే.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ అగ్రనేత కె.ఎర్రన్నాయుడుకు వేలాది అభిమానులు, కార్యకర్తలు శనివారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. భౌతిక కాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన కుమారుడు రామ్మోహన్‌ నాయుడు చితికి నిప్పంటించారు. అంతకుముందు ఎర్రన్నాయుడు స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై ఎర్రన్నాయుడు భౌతిక కాయాన్ని చేర్చారు. అక్కడి నుంచి మొదలైన అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహించే వ్యవసాయ క్షేత్రానికి చేరడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ప్రత్యేక వాహనంపై కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. తమ అభిమాన నేతను చివరిసారిగా చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో నిమ్మాడ పోటెత్తింది. ఉత్తరాంధ్ర నుంచి    తరలివచ్చిన వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్టీలకతీతకంగా నేతలు తరలివచ్చారు. తమ ప్రియతమ నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, బాలరాజు తదితరులు కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రి పల్లం రాజు, నేతలు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుఉ కవిత, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మధు యాష్కీ, సబ్బం హరి, నాగం జనార్దన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, కడియం శ్రీహరి, కన్నబాబు, కృష్ణబాబు విద్యాసాగరరావు లాల్‌జాన్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నాయకులు యనమల రామకృష్ణుడు, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ తదితరులు ఎర్రన్నాయుడు పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ నేతలంతా నిమ్మాడలోనేఉన్నారు. ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమైన అంతిమయాత్ర దాదాపు గంటన్నర తర్వాత వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. అధికార లాంఛనాలు పూర్తయిన అనంతరం రామ్మోహన్‌ నాయుడు చితికి నిప్పంటించారు. 11 గంటకల్లా అన్ని కార్యక్రమాలు ముగిశాయి. అభిమానుల అశ్రునయనాల నడుమ ఎర్రన్నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి.
పురంధేశ్వరి పరామర్శ
ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు శనివారం పరామర్శించారు. కన్నీటిపర్యాంతమైన ఆయన భార్య, కూతురిని ఓదార్చారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎర్రన్నాయుడు చిరంజీవిగా మిగిలిపోతారని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన చేసిన సేవల ద్వారా అందరి మనస్సుల్లో నిలిచిపోయారన్నారు. పార్టీలకతీతకంగా అందరితో కలుపుగోలుగా ఉండే వారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతమని, తనను నమ్ముకున్న ప్రజల కోసం పని చేశారని కొనియాడారు.
సోనియా సంతాపం
టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి మృతిపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి రాష్టాన్రికి, టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. ఎర్రన్నాయుడి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభాతి ప్రకటించారు. ఈ మేరకు సోనియా తన సందేశాన్ని పంపించారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆ సందేశాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.