24 గంటల్లో వారికి వివరాలు ఇవ్వండి

` జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
– డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌
` అభ్యంతరాల గడువు రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు
` జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో ఉంచాలని ఆదేశం
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది. విభజనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది. డివిజన్ల వారీగా జనాభా వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డివిజన్ల విభజనపై అధికారిక మ్యాప్‌? కూడా ఇవ్వాలని సూచించింది. 24 గంటల్లోగా పిటిషనర్లకు వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలిచ్చింది. ఈ వివరాలు ఇచ్చాక రెండు రోజుల్లోపు అంటే 19 వరకు పొడిగిస్తూ పిటిషనర్లు అభ్యంతరాలను తెలపాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనలో నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భౌగోళిక అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని, ఒక డివిజన్‌ మరో డివిజన్‌ మధ్య జనాభాలో తేడా 10 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని చట్టం చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పునర్విభజనకి చెందిన మ్యాపులను సైతం పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని వాదించారు. లంగర్‌హౌజ్‌తో పాటు శాలిబండ డివిజన్‌ పునర్విభజనపై జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. హడావిడిగా డివిజన్ల పునర్విభజన చేశారని అందులో శాస్త్రీయత లోపించిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. మేయర్‌, కార్పొరేటర్లకి డివిజన్ల పునర్విభజనపై కనీస సమాచారం లేదన్నారు. కొత్త డివిజన్లకు సంబంధించిన జనాభా వివరాలను జీహెచ్‌ఎంసీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి పాలనా సౌలభ్యం కోసమే పరిధి పెంచారని వాదించారు.జనాభా, మ్యాప్‌ వంటి విషయాలపై కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చినట్లు అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. పాలనాపరమైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదన్నారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి మ్యాప్‌, జనాభా వివరాలను పిటిషనర్లకి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తామని ఏజీని ప్రశ్నించారు. డివిజన్ల పునర్విభజనపై ఇప్పటికే 3వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని అవన్నీ ఒకే తరహాలో ఉన్నాయని ఏజీ తెలిపారు. ఆ విషయంపై పిటిషనర్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో విలీనంపై : జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని మంగళవారం కాంగ్రెస్‌ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలను తీసుకోవాలని కోరిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌తో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. డివిజన్ల పురనర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్‌ చేసి వినతిపత్రం ఇచ్చామన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, అరికెపూడి గాంధీ ఏ ప్రాతిపదికన విలీనం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
మేయర్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం : మంగళవారం మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీలిమిటేషన్‌? ప్రిలిమినరీ నోటిఫికేషన్‌?ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశారు. వార్డుల పునర్విభజనపై తమకు ఎలాంటి సమాచారం లేదని సభ్యులు వాపోయారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. విలీనం శాస్తీయంగా జరిగిందా? లేదా? అనే ఆవేదన అందరిలోనూ ఉందన్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 17 చివరి తేదీగా ప్రకటించడం సరికాదని, సమయం పెంచాలన్నారు. వార్డుల విభజనపై నగర మేయర్‌కు కూడా తెలియదని వాపోయారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఒక్కో పార్టీ విభిన్నంగా స్పందించాయి.