ఎర్ర స్మగ్లర్ల ఖాతాలకు భారీగా నగదు చేరిక?
కూలీలకు డబ్బు ఎరతో అడవుల నరికివేత
చిత్తూరు,జూలై12(జనం సాక్షి): ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా సంపాదించిన బడా స్మగ్లర్లపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. వారి సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు ఐటీ విభాగం రంగంలోకి దిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో స్మగ్లర్ల బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించింది. రెండు రాష్టాల్ల్రో అక్రమాలకు పాల్పడు తోన్న ఎర్ర దొంగల జాబితాను సేకరించిన టాస్క్‌ఫోర్స్.. ఆదాయపు పన్ను విభాగానికి అందజేసింది. ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అనుమానితుల ఖాతాల్లో చేరిన నగదుపై ఆరా తీస్తున్నాయి. కొందరు స్మగ్లర్లు అక్కడ జమచేశారనే సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించింది. అక్కడ ఉన్న కూలీల ఖాతాలు సహా కొందరు తమ ఖాతాల్లో ఆ నగదును డిపాజిట్ చేశారనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీనిపై పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్‌కు అందటంతో డీఐజీ కాంతారావు రంగంలోకి దిగారు. దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తలచి ప్రత్యేక బృందాలను నియమించారు. వీరితోపాటు ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్మగ్లర్లు సైతం ఇందులో ఉన్నారనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ వద్ద ఉంది. అటవీప్రాంతంలో ఉన్న బ్యాంకుల్లో నగదు జమచేయడంపై టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ప్రధానంగా ఎర్ర కూలీల ఖాతాల్లో భారీగా నగదు జమపై దీనిపై చెన్నైలోని ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖరాశారు. ఆయా ఖాతాలపై తమకు అనుమానాలు ఉన్నాయని.. వాటిపై కూపీలాగాలని టాస్క్‌ఫోర్స్ కోరింది. ఈ మేరకు జిల్లాలో కూడా ఎర్ర స్మగ్లర్ల ఖాతాలపై ఆరా తీస్తున్నారు. వీరు ఎక్కడెక్కడ నగదు జమచేస్తున్నారో.. వీరికి ఇక్డక ఏజెంట్లుగా ఉన్న వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఇలా నగదు జమలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొందరు అక్రమార్కులు ఇప్పటికే తమవద్దనున్న నగదును వేర్వేరు వ్యాపారాల్లోకి చొప్పించి జారుకుంటున్నారనే సమాచారం ఉంది. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన జాబితాలను ఆధారంగా చేసుకుని సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై నిఘా వేసి, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలను పరిశీలిస్తోంది. ఏపీ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో దోచిన డబ్బుపై రహస్యంగా విచారణ జరుపుతోంది. కూలీల ఖాతాలను పరిశీలిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు ఏపీలో కేసులు నమోదైన స్మగ్లర్ల వివరాల జాబితాను ఐటీ విభాగానికి పంపారు. తమిళనాడుకు చెందిన వెయ్యి మందికిపైగా స్మగ్లర్లు ఇలా పెద్ద మొత్తాల్లో నగదును దాచారని టాస్క్‌ఫోర్స్ అనుమానిస్తోంది