ఎవరి హద్దులు వారివే..

పూర్వ యథా స్థితికి భారత్‌-చైనా అంగీకారం
న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
ఎవరి హద్దులు వారివేనని, లడఖ్‌లోని వాస్తవాదీన రేఖ వెంట పూర్వ యథాతథ స్థితిని కొనసా గించాలని భారత్‌-చైనా ఒక అంగీ కారానికి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ధ్రువీకరిస్తూ ఏప్రిల్‌ 15కు ముందు ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇరు దేశాల సైనికాధి కారుల మధ్య ఫ్లాగ్‌ మీటింగ్స్‌ సోమవారం జరిగినట్లు విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జమ్మూకా శ్మీర్‌లోని లడఖ్‌లో దౌలత్‌బేగ్‌ ఓల్డీ సెక్టార్‌ నుంచి భారత్‌, చైనా ప్రభుత్వాలు తమ దళాలను ఆది వారం రాత్రి ఉపసంహరించు కోవడంతో మూడు వారాల పాటు ఇరు దేశాల మధ్య కొనసాగుతూ వచ్చిన ఉద్రిక్తత వాతావరణం చల్లబడిన విషయం విదితమే. సరిహద్దు గుండా పశ్చిమ సెక్టార్‌ గుండా వెళ్లే వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్‌ 15 నాటి వున్న స్థితి పునరుద్ధర ణకు భారత్‌, చైనాలు అంగీకరించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్‌

అక్బరుద్దీన్‌ తెలిపారు. ఈ విషయమై అనుసరించాల్సిన విధివిధానాల ఖరారు, ఏర్పాట్ల ధ్రువీకరణ కోసం ప్లాగ్‌ మీటింగ్స్‌ కూడా జరిగాయన్నారు. మే 9-10 తేదీల మధ్య భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌ చైనాలో అధికారికంగా పర్యటిస్తారని అక్బరుద్దీన్‌ ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు భారత్‌లో చైనా నూతన ప్రధాని లీ కెకియాండ్‌ పర్యటన గురించి ఇరుదేశాలూ చర్చిస్తాయని పేర్కొన్నారు.