ఎసిబి వలలో కాకినాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
కాకినాడ,జూలై10(జనం సాక్షి ): కాకినాడలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)గా విధులు నిర్వర్తిస్తున్న తూములూరి ఆదిశేషయ్య మంగళవారం ఎసిబికి చిక్కారు. ఓ ఇంటి యజమాని నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు.. జగన్నాథపురంలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివాసం ఉండే ¬తా చంద్రమౌళి వారసత్వంగా వచ్చిన తన పాత ఇంటిని కూల్చి, ఆ స్థానంలో ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నారు. నూతన గృహాన్ని పన్ను పరిధిలోకి చేర్చాలంటూ కొద్ది రోజుల క్రితం నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, ఇంటి పన్నును నిర్దారించేందుకు ఆర్‌ఐ ఆదిశేషయ్య బిల్ కలెక్టర్‌తో కలిసి గత నెల 26న చంద్రమౌళి ఇంటికి వచ్చారు. ఇంటి కొలతలు తీసుకుని, తనకు రూ. 20 వేలు ఇస్తే పన్ను తక్కువచెల్లించేలా కొలతలు మార్చి నమోదు చేస్తానని ఆశ చూపారు. అంత మొత్తం ఇవ్వలేనని చంద్రమౌళి చెప్పగా, చివరకి రూ.15 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో చంద్రమౌళి రాజమహేంద్రవరం లోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. లంచం సొమ్ము తీసుకునేందుకు ఆదిశేషయ్య మంగళవారం చంద్రమౌళి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆదిశేషయ్య వద్ద ఉన్న రూ.15 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రాజమహేంద్రవరంలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు చెప్పారు.