ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల సాయం

వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.5 లక్షలు
సీఎం కిరణ్‌
చిత్తూరు, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 15 లక్షల వరకూ సాయమందిస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని నగరి మండలం కావేటినగరంలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ కళలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పది లక్షలు ప్రభుత్వం నుంచి, ఐదు లక్షలు బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల భూమి కొనుగోలుకు గతంలో ఉన్న ఎకరాకు, లక్ష రూపాయల సాయాన్ని రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. విదేశాలకు చదువుకునేందుకు వెళ్లే దళిత విద్యార్థులకు 10 లక్షల రూపాయల వంతున గ్రాంటు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.  చిత్తూరుజిల్లా కార్వేటినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రసంగించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ఎస్‌సి, ఎస్‌టి యువత విదేశీ విద్య చదువుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 10లక్షల రూపాయలు సరిపోకపోతే.. మరో 5 లక్షల రూపాయలను బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని నేడు కార్వేటినగరం నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు. అలాగే ఇతరుల నుంచి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసేందుకు ఉన్న లక్ష రూపాయల శ్లాబును తొలగించి.. ఆ పరిమితిని 5లక్షల రూపాయలకు పెంచుతున్నామన్నారు. ఆ భూములను ఎస్‌సి, ఎస్‌టిలకు బతుకుదెరువు కోసం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సబ్సిడీ ఎంత.. తదితర వివరాలను అధికారులు త్వరలో రూపొందించి తెలియజేస్తారన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టిలకు మరో రెండు కానుకలను ప్రభుత్వం అందజేసినట్టయిం దని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో నివసించే కుటుంబాల వారికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. 50 యూనిట్లలోపు వాడుకునే వారు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదన్నారు. వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. యూనిట్‌కు రూ.5.25పైసల చొప్పున ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఆశయం మేరకు.. యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఎస్‌సి, ఎస్‌టిల కోసం సబ్‌ ప్లాన్‌ను రూపొందించామన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలను తెలుసుకుని రెండు నెలల్లోనే ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. ఆ నివేదికను రెండు రోజుల పాటు అసెంబ్లీలో చర్చకు పెట్టామన్నారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతాయని భావించానన్నారు. నడక మిత్రుడు.. టీడీపీ నేత చంద్రబాబు నడకకే ప్రాధాన్యమిస్తానని అసెంబ్లీకి రాలేదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌, బిజెపి, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు బిల్లును అడ్డుకునేందుకు ఓటింగ్‌ పేరిట కుట్రకు పాల్పడ్డారన్నారు. ఓటింగ్‌లో నెగ్గి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించామన్నారు. అంతేగాక జనాభా ప్రాతిపదికన ఎస్‌సిలకు 16.23శాతం, ఎస్‌టిలకు 6.6శాతం చొప్పున పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించా మన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎస్‌సిలకు రూ.8,585 కోట్లు, ఎస్‌టిలకు రూ.3,666 కోట్లు కేటాయించా మన్నారు. మొత్తం రూ.12,251కోట్లను కేటాయించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రేపో మాపో 2011 జనాభా లెక్కల వివరాలు రానున్నాయని, వాటి ప్రకారం నిధులు మరిన్ని పెరుగుతాయని అన్నారు. అంతేగాక ఈ ఏడాది కేటాయించిన నిధులు ఒకవేళ మిగిలిపోతే.. మిగిలిన నిధులను వచ్చే ఏడాది ఖర్చు చేసేందుకు వీలుగా చట్టం రూపొందించామన్నారు. సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,80,00,000 మందికి మేలు చేకూరుతుందన్నారు. ఆ నిధులతో ఆరోగ్యం, విద్య, పౌష్టికా హారం, మౌలిక వసతులు, అంగన్‌వాడీకేంద్రాలు.. తదితరమైన వాటి కోసం ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. అమ్మహస్తం పేరిట తొమ్మిది నిత్యావసర వస్తువులను కేవలం 185రూపాయలకే అందించే పధకాన్ని ఉగాది పండుగ నాడు ప్రారంభించామన్నారు. రేపో.. ఎల్లుండో.. జిల్లాలో ప్రారంభమవుతుందని చెప్పారు. దీని వల్ల 2,25,00,000 కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. అదేవిధంగా ప్రత్యేక స్కూళ్లు, శిక్షణా కేంద్రాలు, అంగన్‌వాడీకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్వేటినగరంలో అంబేద్కర్‌ భవనం కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేయనున్నట్టు చెప్పారు. స్థలం పరిశీలన కోసం ఎమ్మెల్యే కృషి చేస్తారన్నారు. అలాగే సురేందర్‌నగర్‌లోని ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. ఎమ్మెల్యే కుతూహలమ్మ తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా బహిరంగసభలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు పార్ధసారధి, బాలరాజు, గల్లా అరుణకుమారి, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.