ఏం జరుగుతోంది?

జనంసాక్షి, కరీంనగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతలు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. వీరు పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేసి రాహుల్‌కు నివేదిక సమర్పిస్తారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే అమర్‌కాలేకు రాహుల్‌గాంధీ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమం, కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకు ఏం చేయాలనే అంశంపై అమర్‌కాలేకర్‌ జిల్లాలోని ముఖ్య నేతలతో డీసీసీ కార్యాలయంలో విడివిడిగా భేటీ అయి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తే మెరుగవుతుంది, అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారు…. తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఏఐసీసీ సభ్యులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ మాజీ చైర్మన్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. మీడియాకు అనుమతి లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాహుల్‌ దూత రూపొందించే నివేదిక జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కీలకంగా మారనుంది.