ఏం ప్రగతి సాధించారు

2014లో యూపీఏ పతనం : సుష్మ
న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) :
నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న యూపీఏ-2 సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. అసలు ఏం సాధించారని కాంగ్రెస్‌ నేతలు సంబరాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించింది. యూపీఏ పాలనంతా కుంభకోణాల మయమేనని ఎద్దేవా చేసింది. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్ని సర్వేల చెబుతున్నాయని దేశాన్ని పాలించే నైతిక హక్కు యూపీఏ కోల్పోయిందని విమర్శించింది. యూపీఏ నాయకత్వం చీలిపోయిందని, రెండు అధికార కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. మన్మోహన్‌ దేశానికి ప్రధానో లేక కాంగ్రెస్‌ పార్టీకో అర్థం కావడం లేదని బీజేపీ సీనియర్‌ నేతలు, ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ ఎద్దేవా చేశారు. 2014లోనే దేశ ప్రజలు యూపీఏ కబంధ హస్తాల నుంచి బయటపడతారని జోస్యం చెప్పారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సుష్మ, జైట్లీ విూడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌పై వారు విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ను అటు కాంగ్రెస్‌ పార్టీ కానీ, ఇటు దేశం కానీ నాయకుడిగా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ‘సమస్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు ప్రధానితో చర్చించాలి. కానీ, పరిష్కారం కోసం యూపీఏ చైర్‌పర్సన్‌ (సోనియాగాంధీ) వైపు చూస్తున్నాయి’ అని యూపీఏ ప్రధాని పదవిని బలహీనం చేసిందని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వానికి ప్రత్యేక నాయకత్వం అవసరమే కానీ యూపీఏ దేశానికి నాయకత్వం అందించాల్సి ఉండగా పూర్తిగా విఫలమైందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోరు. అదే యూపీఏ చైర్‌పర్సన్‌ ఒక లేఖ రాస్తే మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని’ ఎద్దేవా చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని కాంగ్రెస్‌ ఒత్తిడి తెచ్చి ఉపసంహరించుకొనేలా చేస్తూ లబ్ధి పొందాలని యత్నిస్తున్నారని సుష్మా విమర్శించారు.యూపీఏ హయాం మొత్తం అవినీతిమయమైందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు ఆరోపించారు. యూపీఏ కాలంలో అవినీతి అన్ని హద్దులను దాటిపోయిందన్నారు. అన్ని కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల వల్ల సగటు పౌరుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలో హయాంలోనూ ఎంతగా ద్రవ్యోల్బణం పెరగలేదని ఆమె గుర్తు చేశారు. ఎన్డీయే హయాంలో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించామని, మంచి ఆర్థిక వ్యవస్థను యూపీఏ చేతికి అప్పగిస్తే.. ప్రభుత్వం పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని సుష్మ మండిపడ్డారు. ‘ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. పూర్తి నిరాశావాదం, నిస్పృహల్లో కూరుకొని మందగమనంలో సాగుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు సరికదా.. ఉన్న వాటిని ఉపసంహరించుకుంటున్నారని’ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ విదేశాంగ విధానం కూడా లోపభూయిష్టంగా ఉందని మండిపడ్డారు. పొరుగు దేశాలతో సంబంధాలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ తీరు కారణంగానే మాల్దీవులు లాంటి చిన్న దేశం కూడా భారత్‌ను బెదిరించే స్థాయికి చేరిందని, చైనా సరిహద్దులు దాటి చొచ్చుకొని వచ్చిందని ఆరోపించారు. లంకలోని తమిళులను రక్షించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో మహిళలపై నేరాలు రెట్టింపయ్యాయని తెలిపారు. ‘అన్ని రంగాల్లో విఫలమైన వారు ఎలా సంబరాలు జరుపుకొంటారని’ ఆమె ప్రశ్నించారు. సీవీసీ లాంటి రాజ్యాంగబద్ద సంస్థలపై నమ్మకం లేని యూపీఏ ఏవిధంగా సంబరాలు చేసుకుంటుందని నిలదీశారు. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. సీవీసీ నియామకంపై తాను అభ్యంతరం లేవనెత్తినా పట్టించుకోకుండా నియమించారని, చివరకు సుప్రీంకోర్టు ఆ నియామకాన్ని కొట్టివేసిందన్నారు. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ విషయంలోనూ ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పాతర వేసే రీతిలో యూపీఏ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆందోళనలు, జైల్‌భరో నిర్వహిస్తామని హెచ్చరించారు. పూర్తిగా విఫలమైన ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సుష్మ వ్యాఖ్యానించారు. తక్షణమే వారు వైదొలిగి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తేనే సగటు పౌరుడికి యూపీఏ కబంధ హస్తాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సామాన్యుడికి మేలు చేసే విధాన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గతంలో ఏ ప్రధాని హయాంలోనూ ఇంతటి అవినీతి పాలన జరగలేదని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌ జైట్లీ ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో అధికారం రెండుగా చీలిపోయిందని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యూపీఏ-2 ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రధాని పాత్రను ఇవాళ యూపీఏ చైర్‌పర్సన్‌ పోషిస్తున్నారని, రేపు మరొకరు పోషిస్తారని విమర్శించారు. గతంలో ఏ ప్రధాని ఎదుర్కొననటువంటి రీతిలో మన్మోహన్‌సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. విధాన నిర్ణయాలు తీసుకోక పోవడం వల్ల ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందన్నారు. విధాన లేమితో యూపీఏ సతమతమవుతోందని, సీబీఐ అండతో పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. సీబీఐని దుర్వినియోగం చేయకుంటే, యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ప్రభుత్వాన్ని రక్షించేవి కావని తెలిపారు. కాంగ్రెస్‌కు అవినీతిని నిర్మూలించాలన్న యావే లేదని.. అందుకే లోక్‌పాల్‌ చట్టం సిద్ధంగా ఉన్నా.. సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏకు ఓటమి తప్పదన్నారు. చిన్న పార్టీలతో కూడిన థర్డ్‌ ప్రంట్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మూడో కూటమి అనేది సాధ్యం కాదని, అది విఫలమైన ప్రయోగం అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్తిగా ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా సూటిగా స్పందించేందుకు సుష్మా, జైట్లీ నిరాకరించారు. ఎన్డీయే ప్రధాని అభ్యర్థి ఎవరనేది తగిన సమయంలో ప్రకటిస్తామని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.