ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్
` సందర్శకుల కోసం పలు ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్,అక్టోబరు 16(జనంసాక్షి):‘ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్’ కోసం చార్మినార్ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ ఆదివారం నుంచి ‘ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికోసం అఫ్జల్ గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మెట్టీ కా షేర్, కాళీకమాన్, ఎతెబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్ పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు. బీబీ బజార్, మొఘల్ పురా వాటర్ ట్యాంకు, హఫీజ్ దంకా మసీదు వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ వద్ద కోట్ల అలీజా, ఎతెబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. మూసాబౌలీ, ముర్గీచౌక్, రaాన్సీ బజార్ నుంచి వచ్చే వాహనాలను లాడ్ బజార్, మోతీ గల్లీ వద్ద ఖిల్వత్ రోడ్ వైపు మళ్లించనున్నారు. అఫ్జల్ గంజ్, నయాపూల్, మదీనా వైపు నుంచి వచ్చే వారికి సర్దార్ మహాల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం, కోట్ల అలీజా బాయ్స్ హైస్కూల్, మదీనా ఎస్ వైజే కాంప్లెక్స్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ముర్గీచౌక్, షాలిబండ వైపు నుంచి వచ్చే వారికి మోతీ గల్లీ పెన్షన్ ఆఫీసు, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మదీనా, పురానాపూల్, గోషామహల్ వైపు నుంచి వచ్చే వారికి కులీకుతుబ్ షా స్టేడియం, సిటీ కళాశాల, ఎంజే బ్రిడ్జ్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, సాధారణ ప్రజలు చార్మినార్ మార్గం బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.