ఏపీలోనూ టీడీపీకి తిరస్కారం తప్పదు
– టీఆర్‌ఎస్ – వైసీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు
–
నల్గొండ, జనవరి16(జనంసాక్షి) : రాబోయో ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి, కాంగ్రెస్‌కు తెలంగాణలోని ఫలితాలే పునరావృతం అవుతాయని, అక్కడి ప్రజలు వారిని తిరస్కరిస్తారని తెరాస ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్-వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విూరు కలిస్తేనేమో మంచి.. మిగిలిన పార్టీల వారు వైసీపీతో మాట్లాడితేనే తప్పు అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేయడం చూస్తుంటే అసహ్యం పడుతుందన్నారు. టీడీపీకి విలువలు లేవని, కాంగ్రెస్‌కు వ్యతిరేఖంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. విలువలు మరిచి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తోపొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. దీని ఫలితంగానే తెలంగాణ ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ కూటమిని కోలుకోకుండా దెబ్బకొట్టారన్నారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని గుత్తా తెలిపారు.