ఏలూరులో ఇఫ్ట్యునేతల అరెస్టు – కలెక్టరేట్‌ ముట్టడికి విఫల యత్నం

ఏలూరు, జూలై 16 : విద్యుత్‌ కోతల వల్ల పరిశ్రమలు పనిచేయడం లేదని ఫలితంగా కార్మికుల ఉపాధి దెబ్బతింటుదని ఆందోళన వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఐఎఫ్‌టియు చేపట్టిన కలెక్టర్‌ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. దాదాపు వంద మందికిపైగా కార్యకర్తలు, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి, ఆపై కార్యాలయం లోపలికి చొచ్చుకువేళ్లే ప్రయత్నం చేశారు. దానితో పోలీసులు వారిని అడ్డుకొని గెంటివేశారు. ఇరువర్గాల మధ్య తొపులాటలు చోటు చేసుకున్నాయి. ఇఫ్ట్యు నగర కార్యదర్శి కె.పోలారీ, నాయకులు రాఘవులు, నరసింహులు మరికొందరని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలారీ మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్‌ కోతల వల్ల రాష్ట్రంలో కోటి 30లక్షల మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఏలూరులో జూట్‌ మిల్లుల్లో పనిచేసే ఆరువేల మంది కార్మికుల ఉపాధి కూడా దెబ్బతింటుందని అన్నారు.