ఐతంలో ప్రాంగణ ఎంపికలు
శ్రీకాకుళం, జూలై 25 : టెక్కలి మండలం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో రెండు కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా గల సాప్ట్‌వేర్ సంస్థ సంతోష్ ఐటి సొల్యూషన్స్ లిమిటెడ్ తరఫున నైన్త్ సొల్యూషన్స్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు సంస్థ మానవ వనరుల విభాగం ప్రతినిధి ఈశ్వర్ తెలిపారు. వీరికి తొలి ఏడాది వార్షిక వేతనంగా 1.44 లక్షల రూపాయలు అందుతుందని, అనంతరం వారి ప్రతిభ ఆధారంగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఎంబిఎ విద్యార్థులకు ఇండియన్ మార్ట్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మార్కెట్ విభాగానికి ఐదుగురు, ఫైనాన్స్ విభాగానికి ఐదుగురు ఎంపికైనట్లు సంస్థ సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ కె.చందు తెలిపారు. స్పెషలైజేషన్‌తో సంబంధం లేకుండా తొలి ఏడాది నెలకు 15వేల రూపాయల వేతనం అందిస్తామన్నారు. మార్కెట్ స్థితి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉద్యోగాలు లభించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కళాశాల డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. త్వరలో మరిన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలతో నియామకాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఆయన వివరించారు.