భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక ఒప్పందం

` స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరు దేశాలు సంతకాలు
లండన్‌(జనంసాక్షి):భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్యశాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరు దేశాల మధ్య ఏటా 34 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా.ఒప్పందం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘’భారత్‌-బ్రిటన్‌ భాగస్వామ్యంలో విజన్‌-2035 లక్ష్యంగా సాగుతున్నాం. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాల్లో కలిసి సాగుతాం. బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుంది. ఆరు బ్రిటన్‌ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పహల్గాం ఘటనను ఖండిరచిన బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశమే లేదు.ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటాం. పలు దేశాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతల పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రపంచదేశాల మధ్య శాంతి నెలకొల్పే విషయంలో భారత్‌-బ్రిటన్‌లు కలిసి ముందుకు సాగుతాయి. ఇది విస్తరణవాదానికి కాలం కాదు.. ఇది శాంతికి సమయం. అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన మృతుల్లో బ్రిటన్‌లోని ఎన్నారైలు ఉన్నారు. మృతులకు మరోసారి సంతాపం తెలుపుతున్నా.ఎన్నారైలు భారత సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతున్నారు. క్రికెట్‌ అంటే ఓ ఆట కాదు… ఆదో పాషన్‌. క్రికెట్‌ తరహాలో భారత్‌-బ్రిటన్‌ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. బ్రిటన్‌ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు. స్టార్మర్‌ భారత్‌కు రావాలని ఆహ్వానిస్తున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు
ఇబ్బందేం లేదు.. ఇంగ్లీష్‌ పదాలు ఉపయోగించొచ్చు: ప్రధాని మోదీ
బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎఫ్‌టీఏ’పై సంతకాల అనంతరం ఇరుదేశాల నేతల ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆంగ్లంలో ప్రసంగిస్తుండగా.. దాన్ని అనువదిస్తున్న హిందీ ట్రాన్స్‌లేటర్‌ కాస్త ఇబ్బంది పడ్డారు. దీన్ని గుర్తించిన ప్రధాని మోదీ.. ‘‘ఇబ్బంది పడకండి. అక్కడక్కడ ఇంగ్లీష్‌ పదాలను ఉపయోగించొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని పేర్కొన్నారు. జరిగిన దానికి అనువాదకురాలు క్షమాపణలు చెప్పగా.. పర్లేదంటూ పరిస్థితిని చక్కదిద్దారు. ఇదంతా గమనించిన బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ చిరునవ్వులు చిందించారు. రెండు దేశాల సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ పేరుతో చేసుకున్న ఒప్పందంపై ఇరుదేశాల వాణిజ్యశాఖ మంత్రులు సంతకాలు చేశారు. దీని ద్వారా భారత్‌- బ్రిటన్‌ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరుదేశాల మధ్య ఏటా 34 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా.