యూపీలో సర్కారు విద్య హుళక్కి!
` దళిత, మైనార్టీ, గిరిజనులు, బలహీనవర్గాలకు ఇక అందని విద్యే..
` ప్రతియేటా వేలాది పాఠశాలలను మూసివేస్తున్న బీజేపీ ప్రభుత్వం
` తక్కువ సంఖ్య పేరిట స్కూళ్ల తగ్గించేందుకు నిర్ణయం
` ఇప్పటికే మహిళల్లో 57శాతానికి మించని అక్షరాస్యత
` 27వేల స్కూళ్లను మూసి.. 27వేల కొత్త మద్యం షాపులకు అనుమతి!
` తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు
స్పెషల్ కరస్పాండెంట్ (జనంసాక్షి) : లింగ అసమానతలు.. వివక్షత, మూఢత్వాలకు ఆలవాలమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇకపై ప్రభుత్వ విద్య అందని ద్రాక్షలా మారనుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను సైతం దూరం చేయనుండటంతో దళిత, మైనార్టీ, గిరిజనులతో పాటు అణగారిన వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ సంఖ్య పేరిట ప్రభుత్వ బడులు తగ్గిస్తున్న సర్కారు.. ప్రైవేటు స్కూళ్ల పెంపుదలకు మాత్రం శరవేగంగా అనుమతులిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లలో 40శాతం ప్రైవేటు విద్యాసంస్థల పెరుగుతుదల ఉండటమే అందుకు నిదర్శనంగా మారింది. యూపీలోని బీజేపీ సర్కారు తీరుకు నిరసనగా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతుండగా.. పిల్లలు సైతం కన్నీళ్లు పెడుతూ రోడ్డెక్కుతున్నారు.
అక్షరాస్యత తక్కువగా రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఒకటి. మూఢనమ్మకాలు, మహిళలపై వివక్షలోనూ ఆ రాష్ట్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా తగ్గిస్తోంది. 50 మంది విద్యార్థులకంటే తక్కువ సంఖ్య ఉన్నందున ఈయేడు మే నాటికి 5వేల పాఠశాలలను మూసివేసింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాల లెక్కల ప్రకారం మొత్తం 27వేల పాఠశాలలను తగ్గించేందుకు యోగి సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల పరిధిలో 89వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ప్రస్తుతం ఆ పాఠశాలలన్నీ చుట్టుపక్కల స్కూళ్లలో విలీనం చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లే పరిస్థితులున్నాయి. లేదంటే బస్సులు లేనిచోట రవాణా భారం కూడా పడుతుందని తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య, ఒక కిలోమీటర్ దూరంలోపే సర్కారు స్కూలు అందుబాటులో ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నప్పటికీ.. యోగి సర్కార్ బేఖాతరు చేసి పాఠశాలలకు మంగళం పాడుతోంది. ఇది బాలికల విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందని మేధావి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాఠశాలలు మూతబడితే మధ్యాహ్న భోజనానికి వేలాది మంది పేద విద్యార్థులు దూరం కానున్నారు.
బాలబాలికల అక్షరాస్యతలో తేడా..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి సర్కారు బడుల పాఠశాలల సంఖ్య తగ్గిపోతుండగా.. అదే యూపీలో ప్రైవేటు స్కూళ్లు పెరుగుతున్నాయి. దీంతో అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలకు విద్య దూరమవుతోంది.2023-24 నాటికి ఉత్తరప్రదేశ్‌లో 1.37 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2017-18 తర్వాత అప్పటికే 15.94శాతం తగ్గాయి. మౌలిక వసతులు, విద్యా నాణ్యత మెరుగుదలకు బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోయింది. ఈ కారణంతో బడులకు తాళం వేస్తుండటం వల్ల పేద పిల్లలకు, ప్రధానంగా బాలికలకు చదువు అందకుండా పోతోందని విద్యావంతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే బాలికల అక్షరాస్యతకు బాలురకు మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది. ఇప్పుడు మరింత ప్రభావం పడే అవకాశమున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.
పిల్లలు కిలోమీటర్ల మేర ఎలా నడుస్తారు? :ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
విలీనం పేరుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయబోతోంది. ఉపాధ్యాయ సంఘాల లెక్కల ప్రకారం, ప్రభుత్వం దాదాపు 27,000 పాఠశాలలను మూసివేయాలని భావిస్తోంది. యూపీఏ సర్కారు విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబాల పిల్లలకు విద్య అందుబాటులో ఉండేలా ప్రతి గ్రామంలో పాఠశాలను ఏర్పాటుచేశారు. పాఠశాలలు ఇళ్లకు దూరంగా ఉంటే, చిన్న పిల్లలు, ముఖ్యంగా బాలికలు పాఠశాలకు చేరుకోవడానికి అనేక కిలోమీటర్లు ఎలా నడుస్తారు? బిజెపి ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కుకు వ్యతిరేకం మాత్రమే కాదు, దళిత, వెనుకబడిన, గిరిజన, మైనారిటీ, పేద, అణగారిన వర్గాలకు కూడా వ్యతిరేకం.
ప్రచారం కోసం కోట్లు.. పాఠశాలలకే డబ్బు లేదు : అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత
పేద కుటుంబాల పిల్లలకు విద్యను అందకుండా చేసే కుట్రే పాఠశాలల విలీన విధానం. వేలాది ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం పిల్లల భవిష్యత్తును నాశనం చేయబోతోంది. బిజెపి తన ప్రచారం కోసం బిలియన్ల రూపాయలు ఖర్చుచేస్తోంది కానీ.. ప్రభుత్వ పాఠశాలలకే డబ్బు లేదు. బిజెపి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తోంది. విద్యతో సహా ప్రతి రంగంలోనూ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టివేస్తోంది. పేదలు, వెనుకబడిన, దళితులు విద్యకు దూరంగా ఉండాలని కోరుకుంటోంది. వారు విద్యావంతుల్కెతే ప్రభుత్వ తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తారు కాబట్టే వారిని చదువుకు దూరం చేస్తోంది.
27వేల స్కూళ్లకు బదులు 27వేల కొత్త మద్యం షాపులు : సంజయ్ సింగ్, ఆమాద్మీ పార్టీ ఎంపీ
వేలాది సర్కారు పాఠశాలలను మూసివేసినందుకుగానూ ఆప్ ఆధ్వర్యంలో ‘స్కూల్ బచావో అభియాన్’ (స్కూల్స్ సేవ్ క్యాంపెయిన్) ప్రారంభించాం. అదేవిధంగా ‘మద్యం దుకాణాలు కాదు, మనకు పాఠశాలలు అవసరం’ అనే నినాదంతో స్థానికులతో కలిసి పోరాడుతున్నాం. అయితే రాష్ట్రవ్యాప్తంగా 27వేలకుపైగా పాఠశాలల మూసివేతకు నిర్ణయించిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం.. 27,308 కొత్త మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించింది. ఇక్కడ మాకు మద్యం దుకాణాలు వద్దు, పాఠశాలలు కావాలి. పిల్లల అప్పీల్‌ను సుప్రీంకోర్టుకు తీసుకెళ్తా.