రాజస్థాన్‌లో విషాదం

` కూలిన పాఠశాల పైకప్పు..
` ఆరుగురు చిన్నారులు మృతి
` రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
జైపూర్‌(జనంసాక్షి):రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ ప్రాథమిక పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. రaాలవర్‌లోని పీప్లోడీ ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం పిల్లలు తరగతులకు హాజరవుతుండగా ఒక్కసారిగా భవనం పైకప్పు కూలిపోయింది.ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలవగా వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించి, చిన్నారులను బయటకు తీయడంలో స్థానికులు సాయపడుతున్నారు. భవనం శిథిలావస్థలో ఉందని, దీనిపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్‌దిలావర్‌ స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించిందన్నారు. గాయపడిన చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, వారి చికిత్సకు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భవనం పైకప్పు ఎలా కూలిపోయిందో తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
కాగా.. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విద్యార్థుల మరణ వార్త తనను ఎంతో బాధించిందని ముర్ము పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని కార్యాలయం కూడా బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేసింది.