భారత్‌ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం

` రష్యానుంచి చమురు దిగుమతి చేసుకుంటే ఊరుకునేది లేదు
` చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలకు కూడా ఇదే పరిస్థితి
` అమెరికా సెనేటర్‌ వార్నింగ్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్‌, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్‌ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్‌ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు.ఫాక్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్‌ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్‌,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్‌ వద్ద ఆయిల్‌ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్‌) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు.మీరు (భారత్‌,చైనా, బ్రెజిల్‌) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్‌) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు.కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండిరచింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.