ఐదురోజులపాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు

బీఏసీ సమావేశంలో స్పీకర్‌ నిర్ణయం
వవిధ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం
అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) :  ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులు జరుగనున్నాయి.  స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభను కనీసం పది రోజులైనా నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కోరింది. అయితే కరోనా నేపథ్యంలో సభను ఐదు రోజులు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు21 ఎజెండా అంశాలను అధికార వైసీపీ ప్రతిపాదించింది. పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి, గత ప్రభుత్వ తప్పిదాలు, ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు-వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర, వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలుచ వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ, వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్‌ జలసిరి, గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు వంటి అంశాలు వైసీపీ ప్రతిపాదించిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు, మహిళా సాధికారికత, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా, సున్నావడ్డీ, మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు, సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్‌ టెండరింగ్‌, అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ సంస్కరణలు, నూతన ఇసుక విధానం వంటి ఉన్నాయి. అంతకుముందు భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని… వెంటనే పరిహారం చెల్లించి రబీలో పెట్టుబడులకు ఆసరా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. నాలుగు రోజులుగా నీళ్లలో మునిగి దెబ్బతిన్న ధాన్యం కంకులు, పత్తి గూడ, ఇతర పంట ఉత్పత్తులతో టీడీపీ ప్రజాప్రతినిధుల ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రదర్శన చేశారు.