ఐపీఎల్ చాంప్ ముంబయి
ఆరంభంలోనే చావుదెబ్బ తీసిన మలింగ
చతికిలపడ్డ చెన్నై
కోల్‌కతా, మే 26 (జనంసాక్షి) :
కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఐపీఎల్-6 ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ నైపుణ్యం ప్రదర్శించిన ముంబయి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 23 పరుగుల తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్-4లో చెన్నై చేతిలో ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు తడబడి ఆడుతూ వెంట వెంటే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ నాలుగు బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. శర్మ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది. థారే ఎలాంటి పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్ 26 బంతులు ఆడి 21 పరుగులు చేసి మోరిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. శర్మ 2, రాయుడు 37, హర్బజన్ 14, ధావన్ 3, జాన్సన్ 1, ఓజా 1 పరుగులు చేశారు. మలింగ డకౌట్ అయ్యాడు. పొలార్డ్ దూకుడుగా ఆడి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 32 బంతుల్లో 60 (ఏడు ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును మలింగ తొలి ఓవర్‌లోనే చావు దెబ్బ తీశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సోకకర్ చేసిన హస్సీని ఒక పరుగుకే పెవిలియన్‌కు చేర్చాడు. తరువాత బంతికే రైనాను డకౌట్ చేశాడు. తరువాత ఓవర్‌లోనే బద్రీనాద్(0)ను జాన్సన్ ఔట్ చేయడంతో మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ధోని 63 (నాటౌట్) పరుగులు చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేక పోయింది. మిగతా బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ 18, బ్రావో 15, మార్కెల్ 10, అశ్విన్ 9, పరుగులు చేయగా రైనా, బద్రీనాథ్, రవీంద్ర జడేజా, మోరిన్‌లో డకౌటయ్యారు. ముంబయి బౌలర్లలో మలింగ 2, జాన్సన్ 2, హర్బజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, ఓజా, ధావన్, పొలార్డ్ తలో వికెట్ తీశారు. ముంబయి జట్టు గెలుపొందడంతో ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కప్‌ను పట్టుకుని గ్రౌండ్‌లో ఊరేగారు. పొలార్డ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
ఇదే నా చివరి ఐపీఎల్ : సచిన్
ఇదే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ అని ముంబయి ఆటగాడు సచిన్ టెండుల్కర్ తెలిపారు. ఐపీఎల్ ట్రోఫీని సాధించిన అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.