ఐసిసి టెస్ట్‌ టీమ్‌లో భారత ఆటగాళ్ళకు నో ప్లేస్‌

అత్యధికంగా ఐదుగురు సఫారీ క్రికెటర్లకు చోటు
దుబాయ్‌ , ఆగస్టు 30: గత ఏడాది టెస్టుల్లో ఘోరపరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా క్రికెటర్లకు ఐసిసి టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కలేదు. 2011 ఆగష్ట్‌ 4 నుండి ఈ ఏడాది ఆగష్ట్‌ 6 వరకూ ఆటగాళ్ళ ప్రదర్శన ఆధారంగా ఐసిసి టెస్ట్‌ టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తం ఆరు దేశాలకు చెందిన 12 మంది క్రికెటర్లు దీనిలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా దక్షిణాఫ్రికా నుండి ఐదుగురు క్రికెటర్లకు చోటు లభించింది. అలాగే ఇంగ్లాండ్‌ నుండి ముగ్గురికి చోటు దక్కింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ వరుసగా ఐదో ఏడాది కూడా ఎంపికవడం విశేషం. అలాగే హషీమ్‌ ఆమ్లా , జాక్‌ కల్లిస్‌ కూడా వరుసగా మూడో ఏడాది చోటు దక్కించుకోవడం విశేషంగా చెప్పొచ్చు. శ్రీలంకకు చెందిన సంగక్కరా మూడోసారి ఎంపికవగా… ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ అలెస్టర్‌ కుక్‌ , స్టువర్ట్‌ బ్రాడ్‌ వరుసగా రెండోసారి సెలక్టయ్యారు. ఐసిసి టెస్ట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఆస్టేల్రియా సారథి మైకేల్‌ క్లార్క్‌ ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం క్లైవ్‌ లాయిడ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న సెలక్షన్‌ ప్యానెల్‌ ఈ టీమ్‌ను ఖరారు చేసింది. ప్రపంచ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించిన వారిలో నుండీ 12 మందిని ఎంపిక చేయడం కోసం చాలా కష్టపడ్డామని లాయిడ్‌ వ్యాఖ్యానించాడు.

ఐసిసి టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ః
అలెస్టర్‌ కుక్‌ ( ఇంగ్లాండ్‌ )
హషీమ్‌ ఆమ్లా ( సౌతాఫ్రికా )
కుమార సంగక్కరా ( శ్రీలంక )
జాక్‌ కల్లిస్‌ ( సౌతాఫ్రికా )
మైకేల్‌ క్లార్క్‌ ( ఆస్టేల్రియా , కెప్టెన్‌ )
మాథ్యూ ప్రియర్‌ ( ఇంగ్లాండ్‌ , వికెట్‌ కీపర్‌ )
స్టువర్ట్‌ బ్రాడ్‌ ( ఇంగ్లాండ్‌ )
సయీద్‌ అజ్మల్‌ ( పాకిస్థాన్‌ )
వెర్నాన్‌ ఫిలాండర్‌ ( సౌతాఫ్రికా )
డేల్‌ స్టెయిన్‌ ( సౌతాఫ్రికా )
ఏబి డివీలియర్స్‌ ( సౌతాఫ్రికా ) (12వ ఆటగాడు )