ఒంటరిగానే పోరాడుతాం పట్టేన్ని సీట్లు గెలుస్తాం

తెలంగాణ సాధిస్తాం
మేలోనే అభ్యర్థుల ఖరారు : కేసీఆర్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 : రానున్న ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశం తీర్మానించింది. శుక్రవారంనాడు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికలు, పార్టీ ఆవిర్భావ సభ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఏ పార్టీతోనూ అంటకాగి మోసపోవడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతమాత్రాన తమకు ఎవరిపట్ల ప్రేమగానీ, ద్వేషం గానీ లేవన్నారు. గత అనుభవాల వల్లే ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నికల ముందు పొత్తుల వల్ల మోహమాటాలుంటాయని, ఎన్నికల తరువాత అయితే అప్పటి రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దాదాపు 12ఏళ్ళుగా ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు పొందినప్పటికీ ఉద్యమాన్ని టిఆర్‌ఎస్‌ కాపాడుకుంటూ వచ్చిందని చెప్పారు. ఇతర పార్టీలకు రకరకాల అజెండాలుండొచ్చు…. కానీ టిఆర్‌ఎస్‌కు మాత్రం ఉన్నది ఒకటే అజెండా. తమ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. అది తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం. తెలంగాణరాష్ట్ర పునర్‌నిర్మాణమే ఆశయం అని కెసిఆర్‌ చెప్పారు. ఈ సారి ఎన్నికలలో ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభజనం ఉంటుందన్నారు. కనీసం 15 ఎంపీ స్థానాలు గెలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. దేశంలో ఇక సంకీర్ణ ప్రభుత్వాలదే రాజ్యమన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వం ద్వారానే తెలంగాణ సాధ్యమని అన్నారు.

రానున్న ఎన్నికలకు మేనెల మొదటి రెండు వారాలలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలో పది బృందాలు విభిన్న రీతిలో సర్వేలు నిర్వహిస్తాయన్నారు. సీనియర్‌ నాయకుడు నాయిని నరసింహారెడ్డి చైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసామని కెసిఆర్‌ తెలిపారు. సర్వే ఫలితాలు, ఎన్నికల సంఘం సిఫార్సు ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. నాయిని ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీలో ఈటెల రాజేందర్‌, విజయరామారావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, మహ్మద్‌అలీ, మధుసూదనాచారి,చందులాల్‌ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ నెల 27వ తేదీన ఆర్మూర్‌లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 250మంది ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ ఏర్పాట్లు జరుగుతాయన్నారు. పార్టీ సీనియర్‌ నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో సభలో ప్రవేశపెట్టే తీర్మానాల పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. ఆర్మూర్‌లో జరిగే సభకు జాతీయ మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభంజనమేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని  స్పష్టమైపోయిందని చెప్పారు. ఈ సమావేశంలో నాయిని నరసింహారెడ్డి, విజయశాంతి, తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారంనాడు కెసిఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కరవు మండలాలలను ఆయన పరిశీలిస్తారు.