ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసు ఉద్యోగం చేయండి

14 ఎఫ్‌ రద్దు ఘనత మాదే
పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సీఎం
హైదరాబాద్‌, మార్చి 28 : కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్భోదించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐల పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. గురువారం నాడు అప్పాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తొలుత పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ ముగించుకుని బయటకు వెళుతున్న 1256 మంది అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏ ఉద్యోగంలోనూ లభించని ఘనత పోలీసు శాఖలో లభిస్తుందని అన్నారు. విధి నిర్వహణలో జవాబుదారి తనంతో నిజాయితీ పనిచేయాలన్నారు. వారి పనితీరు పోలీసు శాఖపైనే కాక, ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వానికి పై అధికారులకే కాక, ప్రజలతో పాటు తమకుతామే జవాబుదారితనంతో ఉండాలని సూచించారు. ప్రతిరోజూ 5 నిమిషాలు ఆలోచించి మనస్సాక్షిగా పనిచేస్తున్నామా? లేదా? విశ్లేషించుకుంటే జీవితంలో గొప్ప లక్ష్యాన్ని, ఆశయాన్ని చేరుకుంటారన్నారు. ఏ పదవి, ఉద్యోగం అన్నది ముఖ్యం కాదు, నీతి, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తున్నారా? లేదా అన్నది ప్రధానమన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ప్రజల మెప్పు పొందితేనే రాజకీయ నాయకులు మనగలుగుతారని, కాని దాదాపు 30 నుంచి 33 సంవత్సరాలు  ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అధికారులు అనుక్షణం  బాధ్యాతాయుతంగా పారదర్శంగా బాధ్యతలు నిర్వహిస్తే ప్రజల మెప్పు పొందుతారన్నారు. చిన్న వయస్సులోనే సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే బాధ్యత మీపై ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరందరికి ఇక్కడ పొందిన శిక్షణ కంటే ఇకపై ఎదురయ్యే అనుభవాలే అసలైన శిక్షణ అని అన్నారు. విధి నిర్వహణలో తొందరపాటు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. సమయం సందర్భాన్ని బట్టి సరైన విచారణ జరిపి న్యాయం వైపు  నిలబడేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యమైనా పోలీసు శాఖపైనే కాక, ప్రభుత్వంపై కూడా పడుతుందని గుర్తించుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దాని అనుగుణంగా   ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ఉద్ఘాటించారు. చట్టపరంగా నీతి, నిజాయితీతో న్యాయంవైపు నిలబడాలని సూచించారు. దేశంలోనే మన రాష్ట్ర పోలీసులకు ఎంతో మంచిపేరు ఉందన్నారు. యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర యువత దేశానికే ఆదర్శమన్నారు.  ప్రభుత్వ ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. ఖాళీల భర్తీలో ఎవరి సిఫార్సులతో పనిలేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా 1.23 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇంకా 1.52 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరో 50-60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం మూడేళ్లలోనే పోలీసు శాఖలోనే 43వేల ఖాళీలను భర్తీ చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 82వేల కొత్త ఉద్యోగాలను సృష్టించామన్నారు. గత 25 -30 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇంతటి ఘనత సాధించలేదన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం 14 ఎఫ్‌ నిబంధనను తొలగించేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ నిర్ణయాన్ని కూడా మార్పు చేయాల్సి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అర్హత పారదర్శకంగా ఉన్నవారికే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీని రాజ్‌బహద్దూర్‌ వెంకట్రామ్‌రెడ్డి అకాడమీగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.