ఒబామా పర్యటన దిగ్విజయం

C

సౌదీకి చేరుకున్న పెద్దన్న

ఆత్మీయ వీడ్కోలు పలికిన భారత్‌

న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒమాబా మూడు రోజుల పర్యటన  ముగించుకుని వెళ్లి సౌదీ చేరుకున్నారు. భారత పర్యటన ముగించుకుని సౌదీ బయలుదేరిన ఒబామా దంపతులకు భారత్‌ ఘనంగా వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో ఒబామా దంపతులు సౌదీ బయల్దేరి వెళ్లారు. ఒబామా సౌదీ రాజు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. భారత్‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఒబామా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తొలిరోజు మోడీతో సమావేశమ పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అణుబందంపై కీలక నిర్ణయాలు జరిగాయి. ఆ తరవాత ఉమ్మడిగా విూడియాతో మాట్లాడారు. వాణిజ్యప్రతినిధులతో సమావేశమయ్యారు. మూడో రోజు యువతీయువకులతో చర్చించారు. ప్రధానంగా అమెరికా, భారత్‌ల మధ్య సత్సంబంధాలపై చర్చించారు. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఒబామా దంపతులు తాజ్‌మహల్‌ వెళ్లాల్సి ఉంన్నా తమ పర్యటనను కుదించుకుని ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీ రాజు అంత్యక్రియలు ఉన్నందున ఒబామా దంపతులు తాజ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు.  ఒబామా దంపతుల భారత్‌ పర్యటన విజయవంతంగా ముగిసినా  మిషెల్లి ఒబామా కోరిక తీరలేదు. తాజ్‌ మహల్‌ను చూడాలని ఊవ్విళ్లూరిన మిషెల్లికి ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. ప్రేమకు చిహ్నమైన తాజ్‌ను ఆ ప్రేమికులు సందర్శించకుండానే తిరిగి వెళ్లిపోయారు. తాజ్‌మహల్‌ను సందర్శించకపోవడంతో మిషెల్లి కొంచెం ఫీల్‌ అయినట్లు తెలుస్తోంది. గతంలో భారత్‌ వచ్చినప్పుడు కూడా ఒబామా దంపతులు తాజ్‌ను వీక్షించలేదు. ఇక మున్ముందు అయినా మిషెల్లి తాజ్‌ను చూసే కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే. భారత్‌ పర్యటనలో భాగంగా వాస్తవానికి ఒబామా దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించాలి. ఈ క్రమంలో తాజ్‌మహల్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు డేగ కళ్లతో కాపలా కాసిన ఒబామా దంపతులు తాజ్‌ను చూడకుండానే సౌదీకి పయనం అయ్యారు. ఒబామా భారత్‌ పర్యటన విజయవంతం కావడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒబామా పర్యటన కొనసాగింది. ఒబామా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల మంది పోలీసులతో ఒబామాకు రక్షణ కల్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఒబామాకు ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 400 కిలోవిూటర్ల దూరంలో విమానాలు, హెలికాప్టర్లు తిరగకుండా సాంకేతికను ఉపయోగించి పటిష్ట బందోబస్తు కల్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా ఆసీనులైన ఎన్‌క్లోజర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌తో చేయబడింది. ఒబామా ఆయన అధికార వాహనం బీస్ట్‌లోనే ఢిల్లీలో తిరిగారు. ఒబామా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీని జల్లెడ పట్టారు. ఒబామా ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి మళ్లీ సౌదీకి తిరిగి పయనం అయ్యే వరకు ఆయనకు పోలీసులు భారీ రక్షణ కల్పించారు.

క్షేమంగా వెళ్లండని ప్రధాని ట్వీట్‌

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ‘సేఫ్‌ జర్నీ’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇరు దేశాల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడ్డాయని, ఒబామా పర్యటన ఓ కొత్త అధ్యాయానికి తెరలేపిందని కూడా పేర్కొన్నారు. నరేంద్రమోదీ ట్వీట్‌ చేసిన కొద్ది సమయంలోనే ఆ సందేశాన్ని 1,477 మంది రీట్వీట్‌ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి దుస్తులు రూపొందించాలని ఉందని ప్రముఖ డిజైనర్‌ బిబు మహాపాత్ర అన్నారు. భారత్‌లో పుట్టి అమెరికాలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడిన ఆయన భారత పర్యటన సందర్భంగా బరాక్‌ ఒబామా భార్య మిచెల్‌ ఒబామా వేసుకున్న దుస్తుల్ని స్వయంగా రూపొందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నేను రూపొందించిన దుస్తుల్ని మిచెల్‌ ఒబామా ధరించడం గొప్ప అనుభూతి. అలాగే భారత ప్రధాని మోదీకి కూడా దుస్తులు రూపొందించాలని ఉంది. ఆ అవకాశం త్వరలోనే వస్తుందనుకుంటున్నాను’ అన్నారు.