ఓడిపోవద్దు.. రాజీపడొద్దు

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలొద్దు ఎంపీ వివేక్‌
హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం ఎంత వరకైనా పోరాడుతామని, ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి. వినోద్‌ అన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ విద్యార్థి కృశాంక్‌ రచించిన ‘ఎవరూ చావొద్దు’, ‘ఎందుకు చనిపోవాలి’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరులో ఓటమి, రాజీకి చోటు లేదని, ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. బతికి ఉండి సీమాంధ్ర పాలకులపై, తెలంగాణ వ్యతిరేకులపై, ఢిల్లీ పెద్దలపై పోరు సాగించాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ ఎండీ ప్రవీణ్‌కుమార్‌, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ, ఉద్యమ నాయకుడు కేశవరావు జాదవ్‌, సినీ దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ, మన చరిత్రను రాసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగానే సీమాంధ్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ చరిత్రగా చెలమణీలో ఉందని తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారు, ఆత్మబలిదానాలకు పాల్పడిన వారి పేర్లు తప్ప వారు సాగించిన పోరాట చరిత్ర ఇంతవరకూ నమోదు కాలేదన్నారు. వారి చరిత్రను పుస్తక రూపంలో తెచ్చి భావి తరాలకు అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీమాంధ్ర పాలకుల ఆధిపత్య ధోరణి కూడా తెలంగాణ చరిత్ర నమోదు కాకపోవడానికి కారణమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు హిమాలయాల ఎత్తుకు ఎదిగిందంటే అందుకు ఉద్యమకారుల సాగించిన పోరాటం, విద్యార్థులు, యువత చేసిన ఆత్మబలిదానాలే కారణమన్నారు. అంతటి మహోన్నత చరిత్రను రాసుకోలేకపోవడం మన వైఫల్యమేనన్నారు. ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను నమోదు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే ఆత్మహత్యలు వద్దంటూ, ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలని, బతికుండి తెలంగాణ సాధించుకుందాం అంటూ పుస్తకాల ద్వారా చాటిచెప్పిన కృశాంక్‌ను వారు అభినందించారు. చరిత్రను ఇప్పటికైనా పుస్తకాల రూపంలోకి తీసుకురాకపోతే, మన చరిత్ర పూర్తిగా కనుమరుగై, పరాయి చరిత్రే మనదిగా మనుగడలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కవులు, రచయితలు, జర్నలిస్టులు చరిత్రను నమోదు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లేశం, గాయకుడు రసమయి బాలకిషన్‌, అద్దంకి దయాకర్‌, దుర్గం భాస్కర్‌, ఎర్రోల్ల శ్రీనివాస్‌, మందల భాస్కర్‌, టీ జేఏసీ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.