ఓయూలో తెలంగాణ కోసం మరో బలిదానం

హైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో మరో బలిదానం చోటు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్తూ మరో విద్యా కుసుమం రాలిపోయింది. సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ నేతలు, పెట్టుబడిదారి శక్తులు చేస్తున్న కుట్రల ఫలితంగా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో వ్యాఖ్యలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఉస్మానియా లైబ్రరీ వద్ద చెట్టుకు ఉరివేసుకొని భరత్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులోంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘కాంగ్రెస్‌, టీడీపీ నేతల మోసం వల్లే తెలంగాణ రావడం లేదు. ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం మానుకోవాలి. తెలంగాణ కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలు సహకరించడం లేదు. టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. భరత్‌ స్వస్థలం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌. అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉస్మానియాలో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భరత్‌ మృతదేహాన్ని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఎంత మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారో చెప్పాలని యూపీఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని నిలదీశారు. విద్యార్థులు యువత కలత చెందవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. భరత్‌ ఆత్మహత్య సమాచారం అందుకున్న బంధువులు, సన్నిహితులు ఉస్మానియాకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు.