ఓయూలో వరుసగా మూడో రోజూ

పేలిన బాష్పవాయువు గోళాలు
శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) :
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు బూటు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు ఖాకీలు ఇంకా లాఠీలు ఝుళిపిస్తూనే ఉన్నారు. భాష్ప వాయువు గోళాలు పేల్చి ఆ యువ కిశోరాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మార్చ్‌కు ముందు సంఘీభావ ర్యాలీ సమయంలో విరుచుకుపడ్డ ప్రభుత్వ బలగాలు, మార్చ్‌ రోజు కూడా విద్యార్థులను నెక్లెస్‌ రోడ్డుకు రాకుండా తమ దమనకాండ కొనసాగించారు. మార్చ్‌ ముగిసినా ఇంకా యూనివర్సిటీలోనే ఉంటూ పోలీసులు విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. మూడో రోజు సోమవారం కూడా పోలీసులు విద్యార్థులు బయటికి రాకుండా బాష్ప వాయువు గోళాలు పేల్చారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలుపాలనుకుంటున్న విద్యార్థులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని
ప్రదర్శిస్తున్నదని, విద్యార్థులను ఖైదీలుగా పరిగణిస్తున్నట్లు చర్యలు తీసుకుంటున్నదని ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సోమవారం క్యాంపస్‌లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు పేల్చారు. విద్యార్థుల నిరసనలు, క్యాంపస్‌ గేట్ల వద్ద తోపులాటలు, క్యాంపస్‌ను అనుకొని ఉన్న కాలనీల్లో పోలీసుల హడావిడి మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం తెలంగాణ కవాతు సందర్భంగా క్యాంపస్‌ నుంచి ర్యాలీగా బయటికి వస్తున్న విద్యార్ధులను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతం రణరంగమైంది. పోలీసులు విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించడంతో క్యాంపస్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీనికి నిరసనగా ఓయు జేఏసీ సోమవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం క్యాంపస్‌లో నుంచి బృందాలుగా బయటకు వస్తున్న విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో మళ్లీ ఆదివారం సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి క్యాంపస్‌ ప్రధాన గేట్ల వద్దే కాకుండా క్యాంపస్‌ నుంచి కాలనీల్లోకి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. కేంద్ర అదనపు బలగాలు క్యాంపస్‌ చుట్టూ మొహరించాయి. విద్యార్థులు బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నింటినీ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇటు ఓయు పోలీస్‌స్టేషన్‌ దగ్గర ర్యాలీ తీస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఓయూకు వెళ్లే దారులన్నింటిని మూసివేశారు. క్యాంపస్‌లో పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉస్మానియా వీసీతో కూడా పోలీసు అధికారులు మాట్లాడారు. విద్యార్థులను బయటకు వదలొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటంతో పోలీసు అధికారులు క్యాంపస్‌ చుట్టు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో పోలీస్‌ క్యాంపులకు అనుమతి లేకపోవడంతో క్యాంపస్‌ చుట్టూ కేంద్ర బలగాలు మొహరించాయి. సోమవారం క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఉస్మానియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాంపస్‌ను మూసివేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను క్యాంపస్‌లోనే దహనం చేశారు. దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లగడపాటి వర్సిటీకి వస్తే ఎవరుంటారో తేల్చుకుందామని విద్యార్థులు సవాలు విసిరారు.