ఔను మారాజు గొప్పోడే

దేశ రాజుల్లో గొప్పలౌకికవా1ది

కాకతీయ ఉత్సవాలతోపాటు నిజాం ఉత్సవాలు జరపాల్సిందే

జనం సాక్షి ప్రత్యేక కథనం

జనవరి2(జనంసాక్షి): అవును… నిజాం రాజులు గొప్పవారే. నిజాం రాజు గొప్ప లౌకిక వాది. కాకతీయ ఉత్సవాలతోపాటు నిజాం ఉత్సవాలు జరపాల్సిందే అని తెలంగాణలో అధిక సంఖ్యాకుల నోట వినిపిస్తోంది. ఈ అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. చరిత్ర తిరగేస్తే తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్‌ రాష్ట్రానికి వారు చేసిన సేవ ఇంతాఅంతా కాదు. అసఫ్‌జాహి వంశీయులైన నిజాం రాజులు 1724 నుంచి 1948 వరకు ఏడు తరాల పాటు హైదరాబాద్‌ను పరిపాలించారు. సామాజిక, కళా సాంస్కృతిక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని చేసి చూపించారు. శిల్పకళా వైభవంతో రాజసం ఉట్టిపడేలా అత్యంత సుందర భవనాలు కోటలు నిర్మించారు. ఆర్మీ, విద్యుత్‌, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌,తపాలా, టెలికమ్యూనికేషన్స్‌,రైల్వే, రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలను విస్తరింప చేశారు. నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లు నిర్మించి దేశం లోని ఇతర ప్రాంతాల నుంచి రావడానికి పోవడానికి వీలుగా ప్రయాణ మార్గాలు పెంపొందడానికి దోహదపడ్డారు. వైద్యసేవల కోసం ఉస్మానియా, నిలోఫర్‌, పాయల్‌ (మానసిక వికలాంగుల కోసం) ఆస్పత్రులను నిర్మించారు. హైదరాబాద్‌ భారత దేశంలో విలీనం అయిన తరువాత కూడా ఆఖరి నిజాం నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)ను నెలకొల్పడం నిజాం రాజుల ప్రజా సేవకు తార్కాణం. విద్యారంగానికి సంబంధించి ఉస్మానియా ఆర్ట్సు కాలేజీ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, సిటీ కాలేజీ, లైబ్రరీ నిర్మించారు. అలీఘడ్‌ ముస్లిం యూనివర్శిటీకే కాదు హిందు బెనారస్‌ యూనివర్శిటీకి కూడా విరాళాలు ఉదారంగా అందించారు.చారిత్రక కట్టడాలుగా ప్రసిద్ధి చెందిన చౌమహల్లా, పురానీ హవేలీ, కింగ్‌కోఠీ, మహబూబ్‌ మేన్సన్‌, ఫలక్‌నుమా, బెల్లవిస్టా, హిల్‌ఫోర్టు, చిరాన్‌ప్యాలెస్‌, సైఫాబాద్‌, ఖిలావత్‌ ప్యాలెస్‌లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వీటన్నిటికన్నా అపురూపమైన కళాకృతుల సేకరణలో మక్కువ చూపి సాలార్‌జంగ్‌ మ్యూజియం నిర్మించడం నిజాం కళాభిరుచికి, ఆదరణకు ప్రపంచమే ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయంగా విదేశీయాత్రికులను ఈ మ్యూజియం విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలో మిగతా రాష్ట్రాల వలె కాకుండా స్వతంత్ర రాష్ట్రంగా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని తీర్చి దిద్దారు. 1951 వరకు హైదరాబాద్‌ రాష్ట్రానికి హైదరాబాది రుపీ అన్న ప్రత్యేక కరెన్సీ చెలామణిలో ఉండేది. ఇండియన్‌ సివిల్‌సర్వీసెస్‌కు స్ఫూర్తి చెంది హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగాభివృద్ధి కోసం రిజర్వాయర్లు నిర్మించారు. నాగార్జునసాగర్‌ నిర్మాణానికి మొదట సర్వే నిజాం కాలం లోనే జరగడం గమనార్హం.బెంగాలీ, గుజరాతీ, పార్సీ, ఒరియా, ఇలా అన్ని మతాల వర్గాల ప్రజలను హైదరాబాద్‌కు ఆహ్వానించి మతసామరస్యాన్ని చాటుకున్నారు. వజ్రాలు, ముత్యాలపై మక్కువ చూపించడం వల్లనే ఈనాటికీ హైదరాబాద్‌ ముత్యాల మార్కెట్‌ ఎంతో ప్రసిద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ప్రపంచంలో కెల్లా అత్యంత శ్రీమంతులుగా నిజాం రాజులు గుర్తింపు పొందినప్పటికీ ప్రజాసేవలో ఏనాడూ వెనుకబడలేదు. దేశం లోని ఆరు మహానగరాల్లో హైదరాబాద్‌ను ఎంతో ప్రాముఖ్యం కలిగిన నగరంగా రూపొందించారు. నిజాం కాలంలో 42 ఏళ్ల పాటు ఢిల్లీ కన్నా హైదరాబాదే మిన్న అన్నంతగా విస్తరించారు. షేర్వాణీకి, బిర్యానీకి కూడా హైదరాబాద్‌ గత కొన్ని తరాలుగా ప్రత్యేకత సాధించడానికి నిజాం రాజుల ఆదరాభిమానాలే కారణం.