ఔను.. వాళ్లు ముగ్గురు ముఖం చాటేశారు !
అవును.. వాళ్లు ముఖం చాటేశారు. ‘నిప్పుకోడి ఇసుకలో తల దాచుకున్నట్లు’ ఇంటి పట్టునే ఉండిపోయారు. చేసిన వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని, వందల సంఖ్యలో యువత చస్తుంటే ఏం చేస్తున్నారని, న్యాయమైన ఆకాంక్షను ఎందుకు చిదిమేస్తున్నారని, తెలంగాణలో రోజుకో ప్రాణం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గాలిలో కలుస్తుంటే, విరిగిన మనసులు అరవై ఐదేళ్లుగా ఉద్యమిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని గల్లా పట్టి అడుగుతారని అమాత్యులు, ఆ ముఖ్యులు చట్టసభల సాక్షిగా ముఖం చాటేశారు. శుక్రవారం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చ జరుగనుందని ఒకరోజు ముందే యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్, మాజీ కేంద్ర హోం మంత్రి చిదంబరానికి తెలుసు. కానీ, ఆ చర్చలో లేవనెత్తే ప్రశ్నలకు సమాధానమేం చెప్పాలో మాత్రం తెలియదు. ఎందుకంటే, వాళ్లు ఇంతకాలం ఆ ‘ప్రధాన సమస్యను’ చూసీచూడనట్లు వ్యవహరించారు. రాజకీయ పగ్గాల కోసం వాడుకున్నారు. ఆ సమస్య కోసం పోరాడుతున్న వారి మనోభావాలను దెబ్బతీశారు. అందుకే, సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతో సభకు డుమ్మా కొట్టారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ చర్చకు పార్టీలకతీతంగా తెలంగాణ ఎంపీలు మద్దతు పలికారు. కానీ, ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ‘ఆ ముగ్గురు’ మాత్రం సభకు హాజరుకాలేదు. ఈ రకంగా మరోసారి ‘తెలంగాణ’పై తమ వైఖరిని యూపీఏ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇంకా నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను నాన్చాలని భావిస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. కానీ, తెలంగాణ ప్రజలు మాత్రం యూపీఏ అవలంబిస్తున్న ఈ వైఖరిపై పెదవి విరుస్తున్నారు. ఇంకా ఓపిక పట్టడం తమ వల్ల కాదంటున్నారు. ఇస్తారో.. ఇవ్వరో తేల్చేయమంటున్నారు. లేకుంటే ‘ముందుంది మొసళ్ల పండుగ’ అని హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ విద్రోహ దినోత్సవమైన సెప్టెంబర్ 17 లోపు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది యూపీఏకే మంచిదని సూచిస్తున్నారు. ‘ఆ ఎన్నికలై పోనీ, ఈ కార్యక్రమం అయిపోనీ, ఆ తంతు ముగియనీ, ఈ నివేదిక రానీ అంటూ ఇంతకాలం కాలం వెల్లదీసినా ఊరుకున్నం.. సకలం కలిసి సమ్మె చేసినాం.. సహాయ నిరాకరణ చేసినం.. మా బిడ్డలను రోజుకొకరిని ఉద్యమానికి బలిచ్చి ఆత్మక్షోభను అనుభవించినం.. ఇదంతా ఎందుకు చేసినం ? ఎందుకు ఇన్ని కష్టాలు భరించినం ? మా తెలంగాణ మాకివ్వాలని.. కానీ, మళ్లీ మళ్లీ మమ్మల్ని మీరు మోసం చేస్తూనే ఉన్నరు.. ఇవ్వాళ కూడా రాజ్యసభకు రాకుండా.. మా ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉంటుందని తెలిసి కూడా డుమ్మా కొట్టిన్రు.. ఇక మేమూరుకోం.. మీ సంగతి చెప్తం’ అంటూ తెలంగాణ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు యూపీఏ ప్రభుత్వం, మాటిచ్చి మరిచిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పించుకోవచ్చు గాక, కానీ, రేపు మళ్లీ ‘అడుక్కునేందుకు’ రాకపోతరా ! అప్పుడు గుణపాఠం చెబుతాం అంటూ తాము చేయబోయే అస్త్ర ప్రయోగాన్ని పరోక్షంగా విశదీకరించి వివరిస్తున్నారు. ‘ఆ ముగ్గురు’ తమ ఆకాంక్షను అవమానించినా, ఆ ముగ్గురి అనుచరులు, తాము ఎన్నుకున్న ఎంపీలను తమ ‘ఇలాఖా’లోనే తిరుగనివ్వమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అయినా, ఇంకో అవకాశంగా సెప్టెంబర్ 17 లోపు తమ ‘కోరిక’ను తీర్చమని ఆల్టిమేటం ఇస్తున్నారు. లేదా అదే సెప్టెంబర్ 30 నుంచి సమరానికి సిద్ధం కావాలని హెచరిస్తున్నారు.