కంతనపల్లి, దేవాదులను సందర్శించిన సీఎం కేసీఆర్
వరంగల్, మార్చి 29(జనంసాక్షి) : దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం పరిశీలించారు. ఏరియల్ సర్వేలో భాగంగా ఏటూరునాగారం మండలంలో 12 గంటల ప్రాంతంలో సిఎం హెలీప్యాడ్ నుండి దిగగానే నేరుగా దేవాదుల ఇన్‌టెక్‌వెల్ వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. అక్కడి నుండి సిఎం దేవాదుల అతిథి గృహానికి చేరుకున్నారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రులు హరిష్‌రావు, ఎంపి సీతారాంనాయక్, మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, దేవాదుల, కంతనపల్లి ఛీప్ ఇంజనీర్లతో కలిసి సందర్శించిన సీఎం 2 గంటల పాటు సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పటికి మూడు విడుతల్లో వేల కోట్ల రూపాయలు వెచ్చించినా అనుకున్నంత మేర నీటి సామర్థ్యం లేక పోవడంతో నీటిని పంపింగ్ చేయడం సాధ్యం కాలేకపోతుందని ఛీప్ ఇంజనీర్లు సిఎంకు వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌లో 80మీటర్ల నీరు నిలవాలంటేనే మోటర్లు నిర్వీరామంగా నడుస్తాయని, దాంతో కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు సాగు, ప్రజలకు తాగు నీరు అందించడం సాధ్యం అవుతుందని తెలిపినట్లు సమాచారం. కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే దేవాదుల ఇన్‌టెక్‌వెల్ వద్ద నీరు 50 టిఎంసిల కంటే ఎక్కువ నీరు ఉంటుందని, దాంతో దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల వలన ఆ మూడు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీరు అందించడం సాధ్యం అవుతుందని వారు తెలిపారు. అదేవిధంగా కంతనపల్లి వద్ద పవర్ స్టోరేజీ చేపట్టడానికి అవకాశం ఉందని, దాంతో కొంత విద్యుత్ కొరత తీరుతుందని, మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా దేవాదుల అతిథి గృహంలో నాలుగు గంటలపాటు బస చేసిన సిఎంను సాయంత్రం 4:25నిమిషాల ప్రాంతంలో ఆదివాసీ సంఘాల నాయకులు కలుసుకున్నారు. కంతనపల్లి ప్రాజెక్టు వలన కంతనపల్లి, ఏటూరు, సింగారం గ్రామాలతోపాటు వేల ఎకరాల సాగు భూమి నీట మునుగుతుందని, ఆదివాసీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని సిఎంకు విన్నవించారు. కంతనపల్లి నిర్వాసితులకు ముందుగా వారు అనుకున్న మేర ప్రభుత్వ నిర్ణయ ప్రకారం పూర్తిగా నష్టపరిహారం అందించాకే కంతనపల్లి బ్యారేజీ పనులు మొదలు పెడుతామని సిఎం గిరిజన సంఘాలకు హామీ ఇచ్చారు. కంతనపల్లి ప్రాజెక్టుపై పూర్తి సమాచారం కోసం వచ్చేనెల 15న గిరిజన సంఘాలను ఆహ్వానించినట్లు తెలిసింది