కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి అసెంబ్లీ

అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం
తెలంగాణ తీర్మానానికే టీఆర్‌ఎస్‌
కళంకిత మంత్రులు, ప్రభుత్వ అవినీతిపై టీడీపీ
హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) :
కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని జేఏసీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దీన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరునూరైనా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ చెబుతుండగా, అసలు ఆ కార్యక్రమానికి అనుమతి లేదని, దాన్ని అడ్డుకొని తీరుతామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ చెబుతున్నారు. చలో అసెంబ్లీపై వైరివర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమాన్ని ఊహించనిరీతిలో విజయవంతం చేసి మరోసారి తెలంగాణ సత్తా చాటాలని జేఏసీ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాలు రచిస్తోంది. ఉద్యమానికి పదును పెడుతోంది. గ్రామస్థాయి జేఏసీలను అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వం ఎలాగో నిర్బంధం విధిస్తుంది కాబట్టి దాన్ని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి సారించింది. జేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈ మేరకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో మిలియన్‌ మార్చ్‌, సాగరహారానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. నిర్బంధాన్ని అధిగమించి కార్యక్రమాలు విజయవంతం చేసిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి తెలంగాణ టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ విషయమై క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘చలో అసెంబ్లీ కార్యక్రమంతో భూకంపం సృష్టిద్దాం’ అంటూ ఆయన పలుసార్లు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరి, హరీష్‌రావు, కె.తారకరామారావు తదితరులు చలో అసెంబ్లీ విజయవంతం చేయాలనే అంశంపైనే ప్రధాన దృష్టి సారించారు. ఇంటికొకరు చొప్పున రాష్ట్ర రాజధానికి రండి.. మన ఆకాంక్షను మరోసారి చాటి చెబుతాం అని వారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దండు కదిలించేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. వాటిని అధిగమించేందుకు వెనుకాడమని, ఇందుకు మిలయన్‌ మార్చ్‌ కార్యక్రమం విజయవంతమేనని తెలంగాణవాదులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ శనివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతల కదలికలపై దృష్టి కేంద్రీకరించారు. ముందుస్తు అరెస్టులు చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఎక్కడికక్కడ ప్రతిఘటించాలని జేఏసీ పిలుపునిచ్చింది. అవసరమైతే అక్కడే, లేదా పోలీసుస్టేషన్లలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. తాము ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన తెలుపుతామని, అరెస్టులు చేస్తే మెరుపు సమ్మెకు దిగేందుకు కూడా వెనుకాడబోమని ఆ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. తమ తడాఖా ఏమిటో ప్రభుత్వానికి అనేక సార్లు రుచి చూపించామని, ఈ సారి కూడా వెనుకాడేది లేదని వారు చెబుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంటే వారికి ఆ క్రెడిట్‌ పోకుండా చేసేందుకు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ‘చలో అసెంబ్లీ’ కి తమ క్యాడర్‌ను పెద్దఎత్తున కదిలించేందుకు సన్నాహాలు చేస్తోంది.
శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమైన అధికారులెవ్వరూ సెలవులపై వెళ్లరాదని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మహంతి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీనియర్‌ అధికారులను అందుబాటులో ఉంచడంతో పాటు సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పూర్తిస్థాయిలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు అసెంబ్లీ చుట్టుపక్కల భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. 15 మంది ఎమ్మెల్యేలపై వేట పడ్డాక జరుగుతున్న ఈసమావేశాలకు ప్రాధాన్యం ఉంది. మరోవైపు విపక్షాలు మరోమారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో తమ పార్టీ అన్ని విధాలా సన్నద్ధమైందని ఆమె చెప్పారు. ఆదివారం పాతబస్తీలో వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యాబలం తమకుందన్నారు. చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతివ్వాలని తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్‌ కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చివరి బ్జడెట్‌ సమావేశాలైనందున అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం పట్టుబడతామని అన్ని పార్టీల రంగు బయటపెడతామన్నారు. ఏపీపీఎస్సీ, ప్రభుత్వంలో అవినీతి కళంకిత మంత్రులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈమేరకు టీడీఎల్పీ సమావేశమై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది.