కనీస హాజరు లేని ఉన్ముక్త్‌ చంద్‌

పరీక్ష రాసేందుకు అనుమతివ్వని ఢిల్లీ కాలేజ్‌
న్యూఢిల్లీ ,ఆగష్ట్‌ 30 : అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌కు కొత్త కష్టం వచ్చి పడింది. హాజరు సరిగా లేని కారణంగా అతన్ని పరీక్షలకు అనుమతించేందుకు ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌ నిరాకరించింది. ప్రస్తుతం చంద్‌ ఈ కళాశాలలో బిఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత ఏడాది నుండి ఇప్పటి వరకూ క్రికెట్‌ షెడ్యూల్‌ బిజీలో ఉన్ముక్త్‌ సరిగా హాజరు కాలేకపోయాడు. దీంతో ప్రస్తుతం అతన్ని ఎగ్జామ్స్‌ రాసేందుకు అనుమతించలేమని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. అయితే స్పోర్ట్స్‌ కోటాలో చదివే వారికి హాజరు విషయంలో మినహాయింపు ఉంటుంది. కానీ స్టీఫెన్స్‌ కాలేజ్‌ మాత్రం ఇలా వ్యవహరించడం వివాదాస్పదమైంది. ప్రపంచకప్‌ తెస్తే మాకేంటి , అతనికి కనీస హాజరు 33.33 శాతం కూడా లేదని , అందుకే అనుమతించడం లేదని కళాశాల ప్రిన్సిపాల్‌ సమర్ధించుకుంటున్నారు. క్రికెట్‌ ఆడుతున్నప్పటకీ… ఎప్పుడూ ఉన్ముక్త్‌ చంద్‌ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్‌లో 74 శాతం మార్పులతో పాసయ్యాడు. ఇదిలా ఉంటే ఈ యువక్రికెటర్‌కు చాలా మంది విద్యార్థులు మధ్ధతుగా నిలిచారు. అటు చంద్‌ కూడా కాలేజీ తీరుపై కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.