కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయం సిద్ధిరామయ్య

హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :
కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు… రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు… ఎందరో మహానుభావులు అందరికీ వందనలు అని ఆయన పేర్కొన్నారు. రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన సన్మానం అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి మంత్రి రఘువీరారెడ్డి అనువదించారు. దక్షిణ భారతదేశంలో అందరి సంస్కృతి ఒక్కటేనని చాటారు. బెంగళూరు మినీ భారతదేశంలాంటిదని అభివర్ణించారు. కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలు పక్కపక్కనే ఉంటూ అన్ని విధాలుగా సహకరించుకుంటున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో మరింతగా దూసుకుపోవాలని ఆకాంక్షించారు. 2014 ఎన్నికల్లో కర్ణాటకలో మాదిరిగానే ఫలితాలు వెలువడుతాయని మంత్రి పితాని సత్యనారాయణ జోస్యం చెప్పారు. అక్కడ భారీ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీ యోధుడు, ముఖ్యమంత్రి సిద్దరామయ్యను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిద్ధిరామయ్యకు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సంప్రదాయాలు, స్నేహపూరిత వాతావరణం ఒకే మాదిరిగా ఉన్నాయన్నారు. తనకు ఇక్కడకు వచ్చినా సొంతరాష్ట్రంలోనే ఉన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం భవిష్యత్తులో బీసీ వర్గాలే రాజ్యాధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. 2014 ఎన్నికల్లో కర్నాటకలో మాదిరిగానే ఎపీలోనూ ఫలితాలు వెలువడనున్నాయని జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహించబోరని అన్నారు. అందుకే కేంద్రంలోను, రాష్ట్రంలోను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను సాగనంపారని అన్నారు.