కన్హయ్యకు భద్రత పెంపు

2

– స్మృతి వ్యాఖ్యలపై మండిపడ్డ విద్యార్థి నాయకులు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 27(జనంసాక్షి):జేఎన్‌యూలో జరిగిన ఘటనల నేపథ్యంలో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్యకుమార్‌కి భద్రత పెంచారు. అతనిపై జైలులో పలువురు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలియజేయటంతో జైలు అధికారులు కన్నయ్యకి భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణతో 5 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా మరో విద్యార్థి అసితోష్‌ని ఈ విషయంపై విచారించారు.దేశద్రోహం కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న జేఎన్‌యూ విద్యార్థి అసుతోష్‌ని శనివారం పోలీసులు విచారించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… గత రాత్రి అసుతోష్‌కి సమన్లు జారీ చేశారు. ఈ ఉదయం అతడు ఆర్కేపురం పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న రామ నాగ, అనంత కుమార్‌ అనే మరో ఇద్దరు విద్యార్థులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమన్లూ జారీ కాలేదు. తాము ఎలాంటి పోలీసు విచారణకైనా సిద్ధమేనని గతంలో వారు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కన్నయ్య కుమార్‌ సహా ఇతర నిందితులు ఖాలిద్‌, అనిర్బన్‌లను శుక్రవారం పోలీసులు విచారించారు. శనివారం తాజాగా అసుతోష్‌ని విచారించారు. ఇదిలా ఉండగా మొత్తం 22 మంది విద్యార్థులు ఫిబ్రవరి 9న ర్యాలీ నిర్వహించడంలో సహకరించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిలో అసుతోష్‌, ఖాలిద్‌, అనిర్బన్‌లు సహా మరి కొందరు ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. కన్నయ్యకుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఈనెల 29న విచారించనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులు స్మృతి పిల్లలు కాదన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలని, ఆమె లాంటి తల్లి అవసరంలేదని జేఎన్యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అనంత్‌ ప్రకాశ్‌ నారాయణ్‌ విమర్శించాడు. గురువారం లోక్సభలో స్మృతి చేసిన ప్రసంగంపై అనంత్‌ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా రాజకీయ అంశం. మేం ఆమెకు రాజకీయ ప్రత్యర్థులం’ అని అన్నాడు. స్మృతి పార్లమెంట్ను తప్పుదోవపట్టించారని విమర్శించాడు. ఈ నెల 9 ఘటనకు సంబంధించి అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.