పాక్, పీవోకేలో వర్ష బీభత్సం..
` 150 మందికి పైగా మృతి, ఇళ్లు ధ్వంసం!
ఇస్లామాబాద్(జనంసాక్షి):పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.గడిచిన 24 గంటల వ్యవధిలో 154 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడిరచారు. అనేక మందికి గాయాలైనట్లు తెలిపారు. పీవోకేలోని గిల్గిత్- బాల్టిస్థాన్‌లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనే అధిక మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.బునేర్ జిల్లాలో 75 మంది మృతి చెందగా.. మాన్సెహ్రా జిల్లాలో 17 మంది, బాజౌర్, బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం, ఆకస్మిక వరదల ప్రభావంతో పలువురు చిన్నారులు సహా 125 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. సహాయక బృందాలు, సైన్యం, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేకమంది గల్లంతైనందున మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి ఫైజీ మీడియాకు తెలిపారు.ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వాహనాలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు కొట్టుకుపోయాయి. నీలమ్ వ్యాలీ వద్ద ఉన్న పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. పలు వంతెనలు సైతం కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా అనేక మంది తప్పిపోయినందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైజీ తెలిపారు.