కాశ్మీర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఘటన 60కి చేరిన మృతులు


` మరో వందమందికి తీవ్ర గాయాలు
` కొనసాగుతున్న సహాయక చర్యలు
శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. గురువారం అమాంతంగా వరద ఉధృతి రావడంతో ప్రజలు కొట్టుకు పోయారు. ఈ ఘటనలో మరో 100 మందికి గాయాలైనట్లు- సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడిరచారు. గల్లంతైన వారి కోసం రెండోరోజు ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు- చెప్పారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు- భావిస్తున్నారు. జమ్మూలో గురువారం మేఘ విస్ఫోటనం విరుచుకుపడిరది. ఫలితంగా మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టు-కుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్‌ మాతా దేవి యాత్రను నిలిపివేశారు. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కిశ్త్‌వాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరం చేయడంలో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు వెల్లడిరచారు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయన్నారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌, స్థానిక స్వచ్ఛంద సంస్థలతోపాటు- దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైంది. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు- అధికారులు వెల్లడిరచారు.