కరీంనగర్‌ జిల్లాలో మరో నిర్భయ

5

– సామూహిక అత్యాచారం

– వీడియో చిత్రీకరణ

– పెల్లుబీకుతున్న నిరసన

కరీంనగర్‌ ,ఫిబ్రవరి 27(జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. వీణవంకలో దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువులు కన్నా హీనంగా ప్రవర్తించిన దుర్మార్గులు… ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోను సోషల్‌ సైట్లలో అప్‌లోడ్‌

చేస్తామని బెదిరిస్తూ ఆమెపై రెండు వారాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.ఆ యువతి …ఇంతటితో తనని వదిలేయండంటూ అని బ్రతిమాలినా కనికరించలేదు. అంతకంతకు వారి వేధింపులు అధికం అయ్యాయి. దీంతో ఆ మానవ మృగాల వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకులను అరెస్ట్‌ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న వరంగల్‌ రేంజ్‌ డీఐజీ మల్లారెడ్డి విచారణకు ఆదేశించారు. కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదు..

తోటి స్నేహితులని నమ్మి… నోరారా అన్నయ్యా అని పిలిచింది.. సొంత సోదరుల్లా చూసుకుంది.. సమస్యలన్నీ చెప్పుకొని సాయం చేయాలని అడిగింది.. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ మృగాళ్లు మాత్రం సమయంకోసం ఎదురుచూశారు. యువతిపై అఘాయిత్యం చేశారు.. సెల్‌ఫోన్‌తో వీడియో బ్లాక్‌ మెయిల్‌ చేశారు.. కాపాడాల్సిన పోలీసులు నిందితులకే అండగా నిలిచారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. నమ్మించి. పోలీసు కావాలన్న లక్ష్యం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. తోటి స్నేహితులే ఆమెపై అత్యాచారం చేశారు.. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది.. బాధితురాలి తల్లిదండ్రులు నిరుపేదలు.. పైగా నలుగురు కూతుళ్లు.. తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకుంది ఆ అమ్మాయి.. వీణవంక మండలంలో పోలీసులు ఏర్పాటుచేసిన శిక్షణా శిబిరంలో చేరింది.. ప్రతిరోజూ చల్లూరునుంచి ఈ క్లాసులకు హాజరయ్యేది.. ఈ తరగతుల్లో కేశవపట్నానికి చెందిన శ్రీనివాస్‌, అంజయ్య అమెకు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, పుస్తకాలు ఇస్తూ యువతికి సహాయం చేశారు. వారిని సొంత అన్నల్లా భావించిన బాధితురాలు ఎంతగానో నమ్మింది. అన్నా వదిలేయాలంటూ ప్రాధేయపడినా.. తరగతులు కొనసాగుతుండగానే కొన్ని పుస్తకాలు కావాలని శ్రీనివాస్‌ను అడిగింది బాధితురాలు.. ఎందుకైనా మంచిదని తన స్నేహితురాలనికూడా తీసుకొని శ్రీనివాస్‌ బైక్‌పై బయలుదేరింది.. వీరిని అంజయ్య, రాకేశ్‌ మరో బైక్‌పై అనుసరించారు.. ఈ విషయం గమనించిన బాధితురాలి ఫ్రెండ్‌ బైక్‌నుంచి దూకి పారిపోయింది.. ఈ యువతి కూడా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ బైక్‌తో వెంబడించి పట్టుకున్నారు.. నిర్మానుష్య ప్రదేశంలో అఘాయిత్యం చేశారు.. ‘అన్నా నన్ను వదిలేయాలంటూ’ కాళ్లు పట్టుకున్నా దారుణంగా కొట్టారు.. అంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బాధితురాల్ని ఊర్లో వదిలేశారు..

నెట్‌ లో పెడతామంటూ..

జరిగిన అఘాయిత్యం తలచుకొని బాధితురాలు కుమిలిపోయింది.. ఏం చేయాలో అర్థం కాక తన అమ్మమ్మవాళ్లింటికి వెళ్లింది… ఇంతలో మళ్లీ ఆ రాక్షసులు యువతికి ఫోన్‌ చేయడం ప్రారంభించారు. తాము చెప్పిన ప్రదేశానికి రావాలని లేకపోతే అత్యాచారం వీడియో నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో జరిగింది కుటుంబసభ్యులు విషయం తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కువెళ్లి ఆ దుర్మార్గులపై ఫిర్యాదు చేశారు..

పోలీసులు.. గుచ్చి గుచ్చి ప్రశ్నలు

అసలే జరిగిన అవమానంతో కుంగిపోతున్న బాధితుల్ని పోలీసులు మరింత వేదనకు గురిచేశారు. బాధితురాల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఆమెను ఇబ్బందిపెట్టారు. మహిళా కానిస్టేబుల్‌తో అడిగించాల్సిందిపోయి స్వయంగా సీఐ ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేయడంతో యువతి మరింత కుంగిపోయింది. ఈ బాధలు భరించలేమని.. తమకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు పెట్టుకుంటున్నారు యువతి తల్లిదండ్రులు.

నిందితులు ఇలా చిక్కారు..

ఇక ఇలా వెళితే లాభం లేదని బాధితురాలి బంధువులు నిందితుల్ని పట్టుకునేందుకు ఒక ప్లాన్‌ వేశారు. యువతి ద్వారా ఫోన్‌ చేయించి ఓ ప్రదేశానికి రప్పించారు. అక్కడ గ్రామస్తుల సహాయంతో ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌ వీడియోలను సాక్ష్యంగా పోలీసుల ముందుంచారు.

న్యాయం చేయండి..

అయితే నిందితుల్ని అరెస్టు చేయాల్సిన పోలీసులు ఆ పనిచేయకపోగా.. యువతి కుటుంబసభ్యుల్నే వేధించడం ప్రారంభించారు. ఓవైపు జరిగిన దారుణం.. మరోవైపు పోలీసుల తీరుతో ఈ కుటుంబం మరింత కుంగిపోతోంది.. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది..

అత్యాచార నిందితలకు మహిళల దేహ శుద్ది..

వీణవంక అత్యాచార నిందితులకు దేహశుద్దిచేశారు మహిళా సంఘాల నేతలు.. వరంగల్‌ ఎంజిఎంలో చికిత్స పొందుతున్న ఇద్దరిపై దాడి చేశారు. ఆడ పిల్లలంటే అంత అలుసా అంటూ నిలదీశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో ఓ యువతిపై ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితులను చితకబాదారు. గాయపడ్డ వీరిద్దరినీ చికిత్సకోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగాయి.  అత్యాచారానికి పాల్పడిన నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నిందితులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆస్పత్రిలో చేర్పించారని.. జనరల్‌ వార్డులో ఇలాంటి నిందితులకు వైద్యం అందిస్తే మిగతా రోగుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు