కర్ణాటక ఎన్నికలే దశ..దిశ

కాంగ్రెస్‌ విజయం తథ్యం
ప్రచార సభలో సీఎం కిరణ్‌
బెంగళూరు/హైదరాబాద్‌, మే 1 (జనంసాక్షి):
తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందరితో చర్చించిన తర్వాత అధిష్టానం ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రెండు రోజులుగా పాల్గొంటున్న ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న జలవివాదాలు సంప్రదింపుల ద్వారానే పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. కర్నాటక, మహారాష్ట్రలతో ఉన్న జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ శాయశక్తులా కృషి చేస్తుందని కిరణ్‌ కుమార్‌ చెప్పారు. అందుబాటులో ఉన్న జలాలను సద్వినియోగం చేసుకోవాలని సమర్థంగా నీటి వాడకాన్ని మెరుగు పరుచుకోవాలని అన్నారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌ పరిధిలో 35 టిఎంసిల నీటిని పొరుగు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల కర్నాటక ప్రాంతానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. మహారాష్ట్ర 14 టిఎంసి, కర్నాటక 21 టిఎంసిల నీటిని వాడుకుంటున్నాయని ఆయన తెలిపారు. కర్నాటకలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలలో ఆయన గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, మహిళ నాయకురాలు గంగాభవానీ తదితరులు ముఖ్యమంత్రి వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌ చెప్పారు. భారతీయ జనతా పార్టీ పాలనతో కర్నాటక ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కర్నాటక ఎన్నికలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి వంటిదని, కాంగ్రెస్‌ విజయం తమ్యమన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే తమ పార్టీకి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారన్నారు.